సమంత తేనెతుట్టెని కదిపిందా

కేరళలో హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మల్లువుడ్ లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో చూస్తున్నాం. అమ్మ సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా దాకా పరిస్థితి వెళ్లిందంటే వ్యవహారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఆర్టిస్టులతో మొదలు సీనియర్ నటీమణుల దాకా ఇప్పటిదాకా బయటికి చెప్పని ఆరోపణలతో మీడియాకు వెళ్లడం తీవ్ర సంచలనం రేపుతోంది. మంజు వారియర్ లాంటి వాళ్ళు ధైర్యంగా ఈ మార్పును స్వాగతించడంతో ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. నిజానికి లైంగిక వేధింపులు కేవలం మలయాళంలోనో సినిమా రంగంలోనో ఉన్నవి కాదు. అన్ని పరిశ్రమల్లో నివురు గప్పిన నిప్పులే.

ఇప్పుడిది టాలీవుడ్ వైపు మళ్లుతోందా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సమంత తెలంగాణ ప్రభుత్వనికి విన్నపం చేస్తూ 2019లో టిఎఫ్ఐలో ఏర్పడిన ది వాయిస్ అఫ్ విమెన్ ఇచ్చిన సబ్ కమిటీ రిపోర్ట్ వెల్లడి చేయాలని చెప్పడం క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. మంచు లక్ష్మి, నందిని రెడ్డి, సుమ కనకాల తదితరులు సామ్ కు మద్దతు తెలుపుతూ తమ సోషల్ మీడియా ద్వారా ఆమె సందేశాన్ని పంచుకున్నారు. ఇలా ఒక్కొక్కరుగా తోడవ్వడంతో సర్కారు స్పందిస్తుందా లేదా అనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి. గతంలో రేగిన క్యాస్టింగ్ కౌచ్ వివాదాలను మర్చిపోకూడదు.

ఒకవేళ నిజంగానే సామ్ కోరినట్టు ఏదైనా కదలిక వస్తే మాత్రం పెద్ద తేనె తుట్టెని కదిపినట్టేనని విశ్లేషకుల అంచనా. ఖడ్గం సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ హీరోయిన్ సంగీత పాత్ర ద్వారా చూపించినట్టు టాలీవుడ్ లోనూ లాంగిక వేధింపులు లేకపోలేదు. కానీ బయట పడిన ఉదంతాలు చాలా అంటే చాలా తక్కువ. ఒకరిద్దరు చెప్పేందుకు ప్రయత్నించినా వాళ్ళు పేరు లేని బాపతు కావడం వల్ల ప్రాముఖ్యం పొందలేదు. ఇప్పుడు స్వయంగా సమంతనే మహిళల రక్షణ కోసం నడుం బిగించాలని తెలంగాణ సర్కారుని కోరడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.