సైకో క్యారెక్టర్ పడిందా.. చెలరేగిపోతాడు

ఎస్.జె.సూర్య అంటే ఒకప్పుడు వాలి, ఖుషి లాంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన దర్శకుడే గుర్తుకు వచ్చేవాడు. కానీ గత దశాబ్ద కాలంలో అతడిలోని ఫిలిం మేకర్ వెనక్కి వెళ్లిపోయి.. నటుడు హైలైట్ అయ్యాడు. ‘నాని’ సినిమాను తమిళంలో తీయాలనుకున్నపుడు అజిత్ నిరాకరించడంతో అనుకోకుండా తనే లీడ్ రోల్ చేశాడు సూర్య.

తెలుగులో డిజాస్టర్ అయిన ఆ చిత్రం.. తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయిపోయింది. నటుడిగా సూర్యకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వేరే దర్శకుల కళ్లు అతడిపై పడ్డాయి. ఈ క్రమంలో అతడి నుంచి కొన్ని సెన్సేషనల్ పెర్ఫామెన్సెస్ వచ్చాయి.

అందులో ‘ఇరైవి’లో చేసిన దర్శకుడి పాత్ర ఒకటి. ఆ తర్వాత విలన్ పాత్రలతో అతను చెలరేగిపోయాడు. ‘స్పైడర్’ డిజాస్టర్ అయినా.. అందులో సూర్య చేసిన సైకో విలన్ పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

తమిళంలో సూర్యకు సైకో క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అతను చెలరేగిపోయాడు. నెంజం మరప్పదిల్లై, మానాడు లాంటి సినిమాల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ కెరీర్ ఆరంభంలో ఆయన సైకో విలన్ పాత్రలు వేస్తే భలే అనిపించేది.

ఇప్పుడు సూర్య విషయంలోనూ ప్రేక్షకులు అలాగే ఫీలవుతున్నారు. కొంచెం తేడాగా ప్రవర్తించే పాత్ర పడితే.. సూర్య శైలికి బాగా నప్పుతోంది. ‘సరిపోదా శనివారం’లోనూ సైకో తరహా పాత్రే చేశాడు సూర్య. తన అన్న ఆస్తి విషయంలో చేసిన మోసానికి కోపం వచ్చినపుడల్లా సోకుల పాలెం అనే ఊర్లోకి వెళ్లి అమాయకులను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టే పాత్ర చేశాడు సూర్య.

తన పైశాచికత్వం చూపించే సన్నివేశాల్లో సూర్య చెలరేగిపోయాడు. సినిమాలో సూర్య కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు అలెర్టవుతారు. ఆసక్తిగా ఆ సన్నివేశాలను ఫాలో అవుతారు. ఆరంభం నుంచి చివరి వరకు అదిరే పెర్ఫామెన్స్‌తో నాని లాంటి పెర్ఫామర్‌ను కూడా డామినేట్ చేయగలిగాడు సూర్య. ఈ సినిమా తర్వాత సూర్య కోసం మరిన్ని సైకో క్యారెక్టర్లు తయారైతే ఆశ్చర్యం లేదు.