ఈగ-2.. నాని అవసరం లేదన్న జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ అనే విజువల్ వండర్ తీయడానికి బలమైన పునాది వేసిన సినిమా.. ఈగ. ఒక ఈగను లీడ్ రోల్‌లో పెట్టి జక్కన్న చేసిన మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం కూడా పెద్ద బడ్జెట్లు పెడితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను రంజింపజేయవచ్చని.. ప్రేక్షకులు కూడా అలాంటి ప్రయత్నాలను బాగా ఆదరిస్తారని ‘ఈగ’ చాటిచెప్పింది.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే జక్కన్న ‘బాహుబలి’ని ఇంకా భారీగా తీయగలిగాడు. ఐతే ‘ఈగ’ సినిమాకు సీక్వెల్ తీయాలని అప్పట్లో అనుకున్నాడు జక్కన్న. కానీ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ‘ఈగ’లో ఓ ముఖ్య పాత్ర పోషించిన నాని.. ఇప్పుడీ సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో భాగంగా ఈగ-2 ప్రస్తావన రాగా.. ఒకవేళ ఆ సీక్వెల్ తీసినా తన అవసరం లేదని రాజమౌళి చెప్పినట్లు నాని వెల్లడించడం విశేషం.

‘‘నేను ఈగ సీక్వెల్ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ అడగలేదు. కానీ రాజమౌళి గారితో మాత్రం ఓసారి సరదాగా చర్చించాను. ఈగ-2 చేస్తానన్నారు కదా, ఎప్పుడు మొదలుపెడదాం అని అడిగాను. దానికాయన.. ‘మేం ఈగ-2 చేసినా నీతో అవసరం లేదు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఈగ సినిమా చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

ఈగ సీక్వెల్ గురించి ఆయనకు ఐడియా వచ్చినపుడు ఆ పనులు మొదలుపెడతారని అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు’’ అని నాని అన్నాడు. ‘ఈగ’లో నాని పాత్రే చనిపోయిన అనంతరం ఈగగా మళ్లీ ప్రాణం పోసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లోనే నాని పాత్ర చనిపోయిన నేపథ్యంలో ఒకవేళ సీక్వెల్ తీసినా నాని అవసరం రాకపోవచ్చు. ఐతే ప్రస్తుతం రాజమౌళి కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఈగ-2 చేసే అవకాశాలు దాదాపు లేనట్లే.