కల్కితో రాయన్ పోలికేంటి గురూ

దేని గురించైనా పోలిక చేసేటప్పుడు స్థాయి, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవడం అవసరం. లేదంటే చివరికి నవ్వుల పాలవ్వడం ఖాయం. మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆగస్ట్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో కల్కి 2898 ఏడి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా 23 నుంచి అదే ప్లాట్ ఫార్మ్ మీద రాయన్ అందుబాటులోకి వచ్చింది. ట్రెండింగ్ అవుతున్న మూవీస్ ప్రకారం ప్రైమ్ క్రమం తప్పకుండా టాప్ లిస్టు పెడుతుంది. అందులో ధనుష్ సినిమా మొదటి స్థానంలో ఉండగా కల్కి రెండో ప్లేస్ తీసుకుంది. ఇదిగో దీన్నే పట్టుకున్నారు కొందరు.

కల్కి కంటే రాయన్ బాగున్నందు వల్లే ర్యాంక్ మారిందని రకరకాల నిర్వచనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రాక్టికల్ గా చూస్తే ఇదెంత అర్థం లేని పోలికో తెలుస్తుంది. థియేటర్లలో రిలీజైన టైంలో కల్కి 2898 ఏడిని ప్రేక్షకులు థియేటర్లలో చూసేశారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. దీంతో సహజంగానే ఓటిటిలో వచ్చినప్పుడు మొదటిసారి రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. కానీ రాయన్ కేసు అలా కాదు. తమిళంలో కలెక్షన్లు రాబట్టింది తెలుగుతో సహా ఇతర భాషల్లో తక్కువ మొత్తానికి అమ్ముడుపోయి నష్టాలు లేకుండా గట్టెక్కింది. ఈ కారణంగా యునానిమస్ బ్లాక్ బస్టర్ అనలేంగా.

టికెట్లు కొని థియేటర్ కు వెళ్లి రాయన్ చూసినవాళ్లు తక్కువ ఉండటంతో సహజంగానే డిజిటల్ లో ఎక్కువ వ్యూస్ నమోదవుతున్నాయి. కల్కి ఎలాగూ పెద్ద తెరపై చూశాం కదా ముందు రాయన్ లాగించేద్దాం అనుకున్న వాళ్ళు లక్షలు, కోట్లలో ఉంటారు. దానికే కల్కి స్థాయి తగ్గిందనుకోవడం కామెడీ. ఆ మాటకొస్తే కొన్ని డిజాస్టర్లు కూడా ఇదే ఓటిటిలో టాప్ వన్ లో ఉన్న దాఖలాలు బోలెడు. అంతమాత్రాన అవి కల్కి కన్నా గొప్ప సినిమాలు అయిపోవుగా. ఇప్పుడీ రాయన్ డామినేషన్ చూపించి ఇదే అత్యుత్తమ సినిమా అనే రీతిలో కొందరు ఫ్యాన్స్ చేస్తున్న ప్రయత్నం హాస్యాస్పదంగా ఉంది.