డిసెంబర్ 6 విడుదల కావాల్సిన పుష్ప 2 ది రూల్ మళ్ళీ వాయిదా పడుతుందేమో, ఆ అవకాశాన్ని వాడుకుందామని చూస్తున్న నిర్మాతల కౌంట్ పెరిగిపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ మూవీ చావా అదే డేట్ కి రావాలని ఫిక్సయిపోయి అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా శివాజీ మహారాజ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందించారు. తండ్రి కొడుకులు బ్రహ్మానందం, గౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం డిసెంబర్ 6 రిలీజ్ చేస్తామని టీజర్ లో చెప్పేశారు. బయటకి చెప్పలేదు కానీ మంచు విష్ణు కన్నప్ప సైతం ఏదైనా ఛాన్స్ ఉంటుందేమోనని ఎదురు చూస్తూ తేదీ లాక్ చేయలేదు.
విశ్వసనీయ సమాచారం మేరకు పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కానివ్వకుండా దర్శకుడు సుకుమార్ చాలా పట్టుదలగా పని చేస్తున్నారట. టైం తక్కువే ఉన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేసేలా ప్లానింగ్ తో ఉన్నారట. ఐటెం సాంగ్ తో పాటు ఇంకొంత భాగం మాత్రమే బ్యాలన్స్ ఉంది. సెప్టెంబర్ లోగా ఇదంతా ఫినిష్ చేసుకుంటే ఇతర కార్యక్రమాలకు, ప్రమోషన్లకు తగినంత టైం ఉంటుంది. మూడేళ్ళ క్రితం పుష్ప 1 ది రైజ్ టైంలోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తినప్పుడు ప్రెజర్ ని తట్టుకుని మరీ చెప్పిన డేట్ కి థియేటర్లకు తీసుకొచ్చారు.
ఒకవేళ డిసెంబర్ 6 వదిలేస్తే మటుకు పుష్ప రిస్కులో పడుతుంది. ఎందుకంటే జనవరి సంక్రాంతికి ఆల్రెడీ సినిమాలు డిసైడయ్యాయి కాబట్టి వాటి మధ్యలో వెళ్లేందుకు కుదరదు. ఫిబ్రవరి డ్రైగా ఉంటుంది. మార్చి చివర్లో లేదా వేసవికి ప్లాన్ చేసుకోవాలి. అదే జరిగితే నెట్ ఫ్లిస్క్ తో జరిగిన ఓటిటి ఒప్పందం ప్రకారం ఇబ్బందులు ఎదురుకోవాల్సి రావొచ్చు. సో ఆరు నూరైనా సరే అనుకున్న టైంలో వచ్చి తీరాలి. అభిమానులు మాత్రం వెయ్యి కోట్ల లక్ష్యం పట్ల నమ్మకంగా ఉన్నారు. నార్త్ లో కూడా భీభత్సమైన క్రేజ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ నుంచి క్లోజింగ్ దాకా రికార్డులు మోతెక్కిపోతాయని ఆశిస్తున్నారు.