అనుష్కనూ వదలని కంగనా రనౌత్

కంగనా రనౌత్‌తో పెట్టుకుంటే ఎవరికైనా కష్టమే. అవతలున్నది ఎంతటి వారైనా చూడకుండా ఆమె విమర్శలు, ఆరోపణలు చేస్తుంది. దేనికైనా రెడీ అనే తరహాలో తెగించి మాట్లాడే ఆమెతో పెట్టుకోవడానికి చాలామంది భయపడుతుంటారు. ఈ మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండతో కంగనా మరీ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. కొన్నిసార్లు ఆమె జోలికి వెళ్లని వాళ్లను కూడా తన నోటి దురుసుతో ఇబ్బంది పెట్టేస్తుంటుంది కంగనా. తాజాగా ఈ జాబితాలోకి అనుష్క శర్మ కూడా చేరింది. మొన్న పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యాన్ని ఎండగడుతూ సునీల్ గవాస్కర్ అనుష్క శర్మ పేరును ప్రస్తావిస్తూ చేసిన విమర్శ దుమారం రేపిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో అనుష్క బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసిన కోహ్లి ఇంతకంటే బాగా ఎలా ఆడగలడన్నట్లుగా సన్నీ మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలపై దుమారం రేగగా.. అనుష్క శర్మ లైన్లోకి వచ్చి గవాస్కర్‌ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త బాగా ఆడకుంటే భార్యను నిందించే అలవాటును ఎప్పుడు వీడతారంటూ ఆయన్ని నిలదీసింది. ఈ విషయంలో అనుష్క కొంచెం ఓవర్ రియాక్ట్ అయినట్లు అనిపించినప్పటికీ.. విరాట్ వైఫల్యానికి అనుష్కను బాధ్యురాలిని చేస్తూ గతంలోనూ ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆమె ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. ఐతే తనకు సంబంధం లేని ఈ వ్యవహారంలోకి కంగనా వేలు పెట్టింది. గవాస్కర్ తీరును తప్పుబట్టింది. అనుష్కకు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించింది. కానీ అంతటితో ఊరుకుందా? లేదు. తనను ఇంతకుముందు ఇలాంటి విషయాల్లో కొందరు టార్గెట్ చేసినపుడు అనుష్క ఏమైందంటూ ప్రశ్నించింది. ఆ సందర్భంలో మౌనంగా ఉన్న అనుష్క.. ఇప్పుడు తనకు ఇబ్బంది కలిగించే విషయంలో మాత్రం గళం విప్పుతోందా.. ఏంటీ సెలెక్టివ్ ఫెమినిజం అంటూ నిలదీసింది. ఐతే ఈ విషయంలో స్పందిస్తే వ్యవహారం చాలా దూరం వెళ్తుందని అనుష్కకు తెలుసు కాబట్టి ఆమె సైలెంటుగా ఉండిపోయింది.