తప్పు ఎవరిది – రవితేజదా దర్శకులదా

ధమాకా సూపర్ హిట్ తర్వాత రవితేజ ఎంపికపై స్వంత అభిమానుల్లోనే తీవ్ర అసంతృప్తి రేగుతోంది. కథల ఎంపికలో చేస్తున్న తొందరపాటుకి తాము బాధ పడుతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఏకంగా ఓపెన్ లెటర్లు రాస్తున్నారు. మాస్ మహారాజా మీద గతంలో ఇలాంటి నిరసన స్వరాలు వినిపించిన దాఖలాలు తక్కువ. ఇక్కడ తప్పు హీరోగా తనదా లేక వాడుకోలేకపోతున్న దర్శకులదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎగరేసే నాణెంలాగ నిందను ఒకవైపే వేయలేం. ఆ మాటకొస్తే రవితేజ మరీ ఓవర్ మూస సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

అర్థం కావాలంటే కొంత పోస్ట్ మార్టం అవసరం. ఈగల్ ఒక ప్రయోగం. డిఫరెంట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కార్తీక్ ఘట్టమనేని ఎక్స్ పరిమెంట్ చేశాడు. పేపర్ మీద బాగున్న కథ తెరపై తేలిపోయింది. అంతకు ముందు టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తీసి పారేసే ప్రయత్నం కాదు. ఆ మాటకొస్తే బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రానా లాంటి హీరోలు ట్రై చేసిన సబ్జెక్టు అది. నిడివి, ఎమోషన్ మిస్ కావడం, ఓవర్ వయొలెన్స్ లాంటి సవాలక్ష కారణాలతో మిస్ ఫైరయ్యింది. రావణాసురలో చేసిన నెగటివ్ షేడ్ క్యారెక్టర్ విభిన్నమైందే కానీ హ్యాండిల్ చేయడంలో వచ్చిన తడబాటుతో తేడా కొట్టేసింది.

ఇదంతా రవితేజని సమర్ధించే ప్రయత్నం కాదు. అమర్ అక్బర్ ఆంటోనీ, టచ్ చేసి చూడు లాంటివి ఆయన స్వయంకృతాపరాధాల కిందకే వస్తాయి. చదివినా ఫ్లాప్ అనిపించే స్టోరీలవి. తర్వాతే జాగ్రత్త పడటం మొదలైంది కానీ ఫలితాలు మాత్రం మారడం లేదు.

మిస్టర్ బచ్చన్ లో హరీష్ శంకర్ చేసిన మార్పుల గురించి సీనియర్ హీరోగా రవితేజ కొంచెం సీరియస్ గా విశ్లేషణ చేసుకుని ఉంటే అవుట్ ఫుట్ మరోలా వచ్చేదేమో. ఇప్పుడు హిందీ పాటల కత్తిరింపు అవసరం ఉండేది కాదు. సామజవరగమన రైటర్లలో ఒకడైన భాను భోగవరపుతో చేస్తున్న ఎంటర్ టైనరైనా అభిమానుల ఆకలి తీరుస్తుందేమో చూడాలి.