జూన్ నెలాఖర్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్‌ను కళకళలాడించింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. కొత్త సినిమాలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ థియేటర్లలో జనాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇలాంటి టైంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ మళ్లీ థియేటర్లకు కళ తీసుకొచ్చింది. ముందు వారాల్లో థియేటర్లు బోలెడన్ని అందుబాటులో ఉన్నా ఆడించడానికి సరైన సినిమాలు లేవు. కానీ ఈ వీకెండ్లో మాత్రం థియేటర్ల కోసం కొట్టేసుకునే పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులకు కూడా బోలెడన్ని ఆప్షన్లు లభించాయి.
తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి మిడ్ రేంజ్ సినిమాలకు తోడు ‘ఆయ్’ అనే చిన్న సినిమా.. ‘తంగలాన్’ అనే డబ్బింగ్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఐతే ఇన్ని సినిమాలు అందుబాటులో ఉన్నపుడు సామాన్య ప్రేక్షకులు బెటర్ ఆప్షన్ చూసుకుని థియేటర్లకు వెళ్తారు. అందుకోసం టాక్, రివ్యూలను ఆశ్రయిస్తారు. ఐతే రిలీజ్ ముందు వరకు క్రేజ్ పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ‘మిస్టర్ బచ్చన్’.. రిలీజ్ తర్వాత చివరి స్థానానికి వెళ్లిపోవడం గమనార్హం. నిర్మాతలు ఎంతో కాన్ఫిడెంట్‌గా బుధవారం ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ వేశారు కానీ.. వాటి వల్ల లాభం కంటే నష్టమే జరిగింది. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చి అది రిలీజ్ రోజున బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీంతో తొలి రోజే ‘మిస్టర్ బచ్చన్’కు ఆక్యుపెన్సీలు పడిపోయాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ విషయానికి వస్తే.. దానికీ మిక్స్డ్ టాక్ తప్పలేదు కానీ.. ‘మిస్టర్ బచ్చన్’తో పోలిస్తే బెటర్ అని తేలింది. మాస్‌లో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఓపెనింగ్స్ వరకు ఢోకా లేదు. ఈ టాక్‌తో వీకెండ్ తర్వాత నిలబడుతుందా అన్నదే డౌటు.
డబ్బింగ్ మూవీ ‘తంగలాన్’ ప్రోమోల్లో ఉన్నంత గొప్పదనం సినిమాలో లేదన్నది టాక్. కానీ వెరైటీ సినిమాలు చూడాలనుకునేవారు, విక్రమ్ నటనను ఇష్టపడేవారు ట్రై చేయొచ్చు. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన వాటిలో అన్నింటికంటే చిన్న సినిమా, అతి తక్కువ అంచనాలున్నది.. అన్నిటికంటే లేటుగా రిలీజైన మూవీ ‘ఆయ్’ చాలా మంచి టాక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మంచి ఎంటర్టైనర్ అనే టాక్ రావడంతో నిన్న సెకండ్ షోలే కాక.. ఈ రోజు మార్నింగ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే ఈ చిన్న సినిమానే ఇండిపెండెన్స్ డే వీకెండ్ విన్నర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.