గత నెల ఇదే సమయంలో రిలీజై దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది ‘ఇండియన్-2’ సినిమా. ముందు నుంచే ఆ సినిమాకు హైప్ తక్కువే ఉంది. సినిమా బాగా ఆలస్యం కావడం, దీనికి తోడు ట్రైలర్ ఇంప్రెసివ్‌గా లేకపోవడంతో బజ్ క్రియేట్ కాలేదు.
ఐతే శంకర్ ఏదో ఒక మ్యాజిక్ చేసే ఉంటాడనే ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. శంకర్ కెరీర్లోనే అట్టడుగున నిలిచే చిత్రం ఇదే అనడంలో మరో మాట లేదు. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో నిర్మాతల పరిస్థితి ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ‘ఇండియన్-2’ బడ్జెట్ రూ.250 కోట్లని వార్తలు వచ్చాయి. ఐతే దీంతో పాటుగా మూడో పార్ట్ కూడా తీశారు కాబట్టి.. దానికి కూడా కలిపే ఈ బడ్జెట్ అనుకున్నారందరూ.
కానీ ‘ఇండియన్-2’; ‘ఇండియన్-3’కి కలిపి శంకర్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టించేశారట. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ‘ఇండియన్’ సీక్వెల్స్ బడ్జెట్ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పారు. ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఆరేళ్లు పట్టిందని.. మధ్యలో క్రేన్ ప్రమాదం జరిగి షూటింగ్ ఆగిపోవడం, బడ్జెట్ హద్దులు దాటిపోవడంతో శంకర్ మీద ఫిర్యాదు చేయడానికి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న తననే ‘లైకా’ అధినేత సుభాస్కరన్ సంప్రదించాడని ప్రసాద్ వెల్లడించారు. అప్పుడు శంకర్‌ను పిలిపించి మాట్లాడామని ప్రసాద్ తెలిపారు.
ముందు ఒక బడ్జెట్ అనుకున్నాక.. దాన్ని రూ.230 కోట్లకు పెంచి అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఐతే ఆ బడ్జెట్ కూడా సరిపోక ఇంకో రూ.170 కోట్లు ఇచ్చారని.. చివరికి దాన్ని కూడా మించిపోయి ఏకంగా రూ.500 కోట్లు ఖర్చయినట్లు తనకు సమాచారం ఉందని ప్రసాద్ వెల్లడించారు. ముందు శంకర్‌తో ఘర్షణ వైఖరే ఉన్నప్పటికీ.. సినిమా పూర్తి కావడం కోసం నిర్మాతలు ఆయనతో రాజీకి వెళ్లారని.. కానీ శంకర్ ప్రతిసారీ చెప్పిన బడ్జెట్లో సినిమా తీయకుండా అదనంగా భారీగా ఖర్చు పెట్టించాడని ‘లైకా’ అధినేతల కష్టాలను ఏకరవు పెట్టారు.