వాళ్లొస్తేనే షూటింగ్‍… లేదంటే లేదు

ఒక మాదిరి హీరోల వరకు నిర్మాతలు నయానో భయానో షూటింగ్‍కి రప్పించేసుకున్నారు. ఇంతవరకు తిరిగి మొదలైన షూటింగ్స్ అన్నీ కూడా మిడ్‍ రేంజ్‍ హీరోలవే తప్ప అగ్ర హీరోల సినిమాలేవీ మొదలు కాలేదు. అక్కడ నిర్మాతల పప్పులుడకవు. దర్శకుల మాట చెల్లదు. ఆ హీరోలు వస్తేనే షూటింగ్‍… లేదంటే లేదు. ప్రస్తుతం అగ్ర హీరోలెవరూ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.

ఇప్పటికయితే అక్టోబర్‍ లేదా నవంబర్‍లో చూద్దామంటూ వాయిదా వేసారు. అప్పటికి అయినా వస్తారో లేదో తెలియదు. చిన్న సినిమాల షూటింగ్స్ అంటే పెద్దగా సిబ్బంది లేకుండా కూడా చేసేసుకోవచ్చు. అందులోను మొదలైన సినిమాలన్నీ కూడా షూటింగ్‍ చివరి దశలో వున్నవి కనుక మరీ అంత టూమచ్‍గా వర్రీ అయిపోనక్కర్లేదు. కానీ అగ్ర హీరోల సినిమాల్లో చాలా వరకు ఇంకా ఆరంభం లేదా మిడ్‍ స్టేజీల్లోనే వున్నాయి.

కరోనా బారిన పడి ప్రముఖులు మరణిస్తూ వుండడంతో హీరోలు మరింతగా బిగుసుకుపోతున్నారు. వాక్సిన్‍ వచ్చినా రాకున్నా కనీసం కేసులయినా తగ్గుముఖం పట్టాలని హీరోలు ఫిక్సయ్యారు. దీంతో ఆయా సినిమాల నిర్మాతలు వాళ్లెప్పుడొస్తే అప్పుడు షూటింగ్‍ చేసుకుందామని ఎదురు చూస్తున్నారు.