ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దిగ్గజం కడుపున పుట్టడం వరమే కాదు.. శాపం కూడా. ఆ దిగ్గజంతో వారి పిల్లల్ని పోల్చి చూడటం వల్ల వాళ్లు ఏం చేసినా గొప్పగా అనిపించదు. ముఖ్యంగా ఆ వ్యక్తి ఉన్న రంగంలోకే పిల్లలు వస్తే ఇంకా ఇబ్బంది. క్రికెట్లో లెజెండరీ స్టేటస్ అందుకున్న సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌ల కొడుకులు క్రికెట్లోకి వచ్చి తమ తండ్రులను ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే.
సంగీతం విషయానికి వస్తే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిల్లలైన చరణ్, పల్లవి తండ్రిలా ఎదగలేకపోయారు. పల్లవి కూడా సింగరే కానీ.. సినిమాలకు పాడే స్థాయికి రాలేదు. చరణ్ సినిమాల్లో చాలా పాటలే పాడాడు, ప్రశంసలు అందుకున్నాడు కానీ.. అతడి పాటల ప్రయాణం కూడా మధ్యలో ఆగిపోయింది. తన పేరు ప్రఖ్యాతులు తన పిల్లలకు శాపంగా మారాయని, తన నీడలో వాళ్లు ఎదగలేకపోయారని ఒక సందర్భంలో బాలు బాధ పడటం గమనార్హం.
చరణ్ మంచి గాయకుడని.. కానీ అతడి ప్రతిభకు తగ్గ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయాడని బాలు అప్పట్లో అన్నారు. ఇక తన అభిరుచి మేరకు చరణ్ సినిమాలు నిర్మిస్తానంటే తాను వద్దని చెప్పలేదని.. కానీ అతను నిర్మించిన సినిమాలతో రూ.16 కోట్ల దాకా పోగొట్టుకున్నాడని.. అయినా సరే తన ప్రయత్నమేదో తాను చేస్తున్నాడని బాలు చెప్పుకొచ్చారు. తమిళంలో చరణ్ నిర్మించినవన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. అందులో జాతీయ అవార్డు సాధించిన ‘ఆరణ్య కాండం’ కూడా ఉంది. కానీ అతడి సినిమాలు చాలా వరకు కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి.
ఇదిలా ఉండగా.. ఒక సందర్భంలో తన చివరి కోరికను కూడా బాలు బయటపెట్టారు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని.. ఈ లోకం నుంచి వెళ్లిపోయే ముందు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా హాయిగా నిద్రలోనే కన్నుమూయాలనేదే తన చివరి కోరిక అని బాలు చెప్పుకొచ్చారు. మరణించే ముందు కూడా పాడుతూ ఉండాలని కూడా ఆయన కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఆయన మరణం చోటు చేసుకోవడం విచారకరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates