ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన లాపతా లేడీస్ ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక వారాల తరబడి టాప్ 10లో ఉండటమే కాక ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ కటియావాడి లాంటి భారీ చిత్రాలకు వ్యూస్ పరంగా తీవ్రమైన పోటీ ఇచ్చింది. బాక్సాఫీస్ వసూళ్లలో వంద కోట్లకు పైగా సాధించి పెద్ద హిట్టు కొట్టింది. అమీర్ ఖాన్ నిర్మాతగా మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ప్రొడ్యూసర్ గా అమీర్ జీవితాంతం గర్వంగా చెప్పుకునే ఘనత అందుకుంది.
1950 జనవరి 28న భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఆవిర్భవించింది. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న సంబరాల్లో జడ్జీలకు, వేడుకలో పాల్గొనే విశిష్ట అతిథులకు లాపతా లేడీస్ ని ప్రత్యేకంగా స్క్రీన్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా ఇలాంటి అచీవ్ మెంట్ అందుకోలేదు. ఈ శుక్రవారం సాయంత్రమే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అమీర్, కిరణ్ రావులతో పాటు అత్యున్నత ర్యాంకుల్లో ఉన్న రిజిస్ట్రీలు, న్యాయమూర్తులు ఇందులో పాల్గొంటారు. వీళ్ళలో అధిక శాతం లాపతా లేడీస్ ని ఇప్పటిదాకా చూడకపోవడం గమనార్హం.
ఇద్దరు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు పొరపాటున తప్పిపోయి వేరే అత్తిళ్లకు వెళ్లడమనే పాయింట్ మీద కామెడీ, ఎమోషన్స్ రెండూ మిక్స్ చేసి కిరణ్ రావు తీసిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అన్నట్టు ఈ లాపతా లేడీస్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ హక్కులకు సంబంధించిన రేటు చాలా ఎక్కువగా చెబుతున్నందు వల్ల అమీర్ ని కలిసిన వాళ్ళు వెనక్కు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. తక్కువ బడ్జెట్ తో ఇమేజ్ లేని ఆర్టిస్టులతో తీయాల్సిన ఇలాంటి చిత్రానికి కేవలం రైట్స్ కోసమే ఎక్కువ ఖర్చుపెడితే వర్కౌట్ కావడం చాలా కష్టం.