డబుల్ ఇస్మార్ట్.. రిలీజ్ వరకు టెన్షనే

ఇంకో వారం రోజుల్లోనే ఇండిపెండెన్స్ డే సినిమాల సందడి మొదలవుతుంది. ఆ వీకెండ్లో తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి క్రేజీ మూవీస్‌తో పాటు.. ‘ఆయ్’ అనే చిన్న సినిమా.. ‘తంగలాన్’ అనే డబ్బింగ్ మూవీ ఈ క్రేజీ వీకెండ్లో రిలీజ్ కానున్నాయి. ఐతే వీటిలో మిగతా మూడు చిత్రాలకూ లేని ఇబ్బంది ‘డబుల్ ఇస్మార్ట్’ ఎదుర్కొంటోంది. ‘మిస్టర్ బచ్చన్’ అన్నింట్లోకి ఎక్కువ క్రేజున్న సినిమా. రవితేజ సినిమా అంటేనే క్రేజ్ బాగుంటుంది. దానికి తోడు హరీష్ శంకర్ డైరెక్షన్, కొత్తమ్మాయి భాగ్యశ్రీ బోర్సే అందచందాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాకు బిజినెస్ కూడా బాగా జరిగింది. రిలీజ్ పరంగా కూడా ఏ ఇబ్బందులూ లేవు. కావాల్సినన్ని థియేటర్లు ఈ చిత్రానికి దక్కాయి. రిలీజ్ ఏర్పాట్లు కూడా ఘనంగానే జరుగుతున్నాయి.

ఇక ‘ఆయ్’ సినిమాను రిలీజ్ చేస్తున్నది గీతా ఆర్ట్స్ కావడంతో దాని స్థాయిలో ఏ ఇబ్బందీ లేనట్లే. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ‘తంగలాన్’కు ఇక్కడ పెద్దోళ్ల సపోర్ట్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో దానికీ ఇబ్బందీ లేదు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ పరిస్థితే ఆందోళనకరంగా ఉంది. దీనికి ముందు పూరి జగన్నాథ్ తీసిన ‘లైగర్’ మూవీకి సంబంధించి నష్టపరిహారం గొడవ ‘డబుల్ ఇస్మార్ట్’ను వదిలేలా లేదు. సినిమా బిజినెస్ అయితే క్లోజ్ అయిపోయింది కానీ.. ఎగ్జిబిటర్లు సహకరించేలా లేరు. కొన్ని రోజుల నుంచి ఎడతెగని చర్చలు జరుగుతున్నా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఓవైపు పోటీలో ఉన్న మిగతా చిత్రాలకు థియేటర్ల బుకింగ్స్ అయిపోతున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్’కు మాత్రం థియేటర్లు ఓకే కావట్లేదు. పాత గొడవలు తేలితే తప్ప థియేటర్ల సమస్య తీరేలా లేదు. పూరి ఏమో ‘లైగర్’ నష్టపరిహారం విషయంలో ఏమీ తేల్చకుండా ఉండిపోయారు. ఎగ్జిబిటర్లు అనధికారంగా ‘డబుల్ ఇస్మార్ట్’ను బాయ్‌కాట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వచ్చే రెండు మూడు రోజుల్లో తేలకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ ఇండిపెండెన్స్ డే వీకెండ్ రేసు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు.