తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము ప్రకటించిన గద్దర్ అవార్డులకు పరిశ్రమ నుంచి స్పందన రాలేదని ఒక సభలో బహిరంగంగా చెప్పడంతో ఒలంపిక్స్ వేడుకల కోసం విదేశాల్లో ఉన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం నిన్న హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో కనుమరుగైపోయిన నంది పురస్కారాల స్థానంలో వీటిని ప్రవేశ పెడతామని చెప్పి నెలలు గడిచిపోయినా వాటికి సంబంధించిన చర్యలకు ఎలాంటి కదలిక కనిపించలేదు. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులను నటీనటులు గర్వంగా భావించేవారు. వీటికి టాలీవుడ్ ఆస్కార్స్ అనే పేరుండేది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు దశాబ్దాల తరబడి ఈ నందుల ప్రధానం ఘనంగా జరిగేది. తర్వాత కొన్ని వివాదాలు, ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా ఆపేశారు. పునరుద్దరించే దిశగా ఎవరూ ఆలోచించలేదు కూడా. ఇప్పుడు స్వయానా స్టేట్ సిఎం చెప్పాక కూడా ప్రణాళిక రూపొందించుకోకపోతే నష్టమేమీ లేదు కానీ చేతులారా గౌరవాలు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. వీలైనంత త్వరగా మా అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సమాఖ్య సంయుక్తంగా దీనికి సంబందించిన కార్యాచరణకు పూనుకోవాలి. తక్కువ రోజుల్లో టాలీవుడ్ నుంచి ప్రాతినిధ్యం వెళ్ళాలి.
సైమా, ఫిలిం ఫేర్, ఈఫా అంటూ ప్రైవేట్ ఈవెంట్ల వేడుకలకు యెనలేని ఉత్సాహం చూపించే స్టార్లు గద్దర్ అవార్డులను కూడా అంతే గొప్పగా ఫీలవ్వాలి. ఆంధ్రప్రదేశ్ సర్కారు తరఫున డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా నంది అవార్డులను పునః ప్రారంభించే దిశగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు సూచన చేశారనే టాక్ వినిపించింది కానీ అదెంత వరకు నిజమో ఇంకొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది. ఒకప్పటి నంది వైభవం వెంటనే రాకపోవచ్చు కానీ క్రమంగా ప్రతి ఏడాది ఇచ్చుకుంటూ పోవడం వల్ల ప్రజల్లోనూ దాని పట్ల అవగాహన పెరుగుతుంది. చూడాలి మరి ఎవరు విన్నారో ఎవరు వస్తారో.