ఒకే హీరో సినిమా తక్కువ గ్యాప్ లో రిలీజ్ కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మాత్రం సేఫ్ కాదు. కానీ రాజ్ తరుణ్ నిర్మాతలు అదేమీ లెక్క చేయడం లేదు. మొన్న శుక్రవారం విడుదలైన పురుషోత్తముడు ఎలాంటి ప్రభావం చూపించకుండానే బాక్సాఫీస్ వద్ద సెలవు తీసుకునేందుకు సిద్ధమవుతున్న వైనం చూస్తున్నాం. భారీ బడ్జెట్, సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్, పెద్ద సాంకేతిక బృందం ఇలా ఎన్ని హంగులు పెట్టినా రొటీన్ కథను జనం తిరస్కరించారు. కట్ చేస్తే ఏడు రోజులు తిరగడం ఆలస్యం ఎల్లుండి ఆగస్ట్ 2 తిరగబడరా సామీ థియేటర్లలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది.
వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య పెట్టిన కేసులో విచారణ ఎదురుకుంటున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం బయటికి వచ్చే పరిస్థితిలో లేడు. ప్రమోషన్ ఎంత అవసరమైనా సరే రాలేని తన నిస్సహాయతను నిర్మాతలకు ముందే చెప్పేస్తున్నాడు. ఇది పురుషోత్తముడు పబ్లిసిటీ మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు తిరగబడరా సామీకి అదే రిపీట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ మార్కెట్ ఏమంత బాగాలేదు. ఓపెనింగ్స్ ఆశించడం అత్యాశ అవుతోంది. పైగా దర్శకుడు రవికుమార్ చౌదరి ఫామ్ కోల్పోయి ఏళ్ళు గడిచిపోయాయి. బజ్ రావడం చాలా కష్టం.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆగస్ట్ ఒకటి రెండు తేదీల్లో విపరీతమైన పోటీ ఉంది. మూకుమ్మడిగా ఏడెనిమిది సినిమాలు దాడి చేస్తున్నాయి. అల్లు శిరీష్ బడ్డీ, అశ్విన్ బాబు శివం భజే లాంటివి కాసిన్ని అంచనాలు మోస్తున్నాయి. కాన్సెప్ట్ పరంగా చూసుకున్నా తిరగబడరా సామీ కన్నా మెరుగైన కంటెంట్ అనిపిస్తున్నాయి. అలాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని రాజ్ తరుణ్ రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. కేసు గొడవ తగ్గాక ప్రమోషన్లకూ వచ్చే ఛాన్స్ ఉండేది. మరి ఓటిటి కండీషనో లేక ఇంకేదయినా కారణమో ఏదైతేనేం పెద్ద సాహసమే చేస్తున్న సామీ ఏ ఫలితం అందుకుంటాడో.