పొరుగునే ఉన్న కోలీవుడ్ నిర్మాతలు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇతర పరిశ్రమలను ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. ఇకపై స్టార్ హీరోల సినిమాలు థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటిటిలో రావాలనే కఠిన నిబంధన వాటిలో మొదటిది. ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నందున, అవి తీరేవరకు ఆగస్ట్ 16 నుంచి కొత్త షూటింగులు మొదలుపెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. నిర్మాణంలో ఉన్నవన్నీ అక్టోబర్ 31లోగా పూర్తి చేసే తీరాలని డెడ్ లైన్ విధించింది.
నవంబర్ 1 నుంచి చిత్రీకరణలు పూర్తిగా ఆపేయాలని కూడా పేర్కొంది. పలు అసోసియేషన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. మల్టీప్లెక్స్ యజమాన్యాలు, థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ భాగమయ్యారు. నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్న కొందరు హీరోలు వాటిని పూర్తి చేయకుండా వేరే వాళ్లకు కాల్ షీట్స్ ఇవ్వడాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఈ విషయంలో హీరో ధనుష్ కి రెడ్ కార్డు జారీ చేస్తున్నట్టు హెచ్చరిక చేసింది. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న ఎన్నో చిత్రాలు థియేటర్లు దొరక్క ల్యాబులో మగ్గుతున్నాయని, అవి వచ్చే దాక కొత్త వాటికి ఛాన్స్ ఇచ్చేది లేదని చెప్పేసింది.
రెమ్యునరేషన్లు ఇష్టం వచ్చినట్టు పెంచి నిర్మాతల మీద విపరీతమైన భారాన్ని మోపుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు కూడా ప్రతిపాదించేందుకు కౌన్సిల్ సిద్ధమవుతోంది. ఇవన్నీ క్రమబద్దీకరించడానికి సమయం కావాలి కనక పైన చెప్పిన డెడ్ లైన్స్ తీసుకొచ్చామని స్పష్టత ఇచ్చింది. నిజంగా ఇవన్నీ కార్యరూపం దాలిస్తే మంచిదే. ఎవరి స్వార్థం వారు చూసుకుని థియేటర్ వ్యవస్థను ఓటిటికి బలిచేస్తున్న వాళ్ళను కట్టడి చేయడానికి అవకాశం దొరుకుంది. గతంలో ఇలాంటి సంస్కరణలు ప్రయత్నించారు కానీ అవి సఫలం కాలేదు. ఈసారి ఫలితం వస్తే మాత్రం ఇతర భాషలు ఫాలో అవ్వొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates