ప్రతి బియ్యం మెతుకు మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు ఈ సామెత సినిమాలకూ వర్తిస్తుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ ఉషా పరిణయం. ఆగస్ట్ 2 థియేటర్లలో విడుదల కానుంది. కొడుకు శ్రీకమల్ తో ఆయన తీసిన జిలేబి అంచనాలు అందుకోలేకపోయినా మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాగా ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.
ఇది పద్నాలుగు సంవత్సరాల క్రితం సంగతి. పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ డెబ్యూని తొలుత విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనే ప్లాన్ చేశారు. అదే ప్రేమ కావాలి. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే ఆ కథనే తీసుకుని ఆది సాయికుమార్ ని టాలీవుడ్ కు లాంచ్ చేశారు. మంచి విజయంతో వసూళ్లు, ఆఫర్లు రెండూ తీసుకొచ్చింది. అదే సమయంలో వైవిఎస్ చౌదరి ప్లాన్ చేసుకున్న రేయ్ ద్వారా ఆది సాయికుమార్ పరిచయం కావాలి. కానీ అనూహ్య పరిణామంతో అది కాస్తా సాయి ధరమ్ తేజ్ డెబ్యూ అయ్యింది. ఫలితం ఏమయ్యిందో చూశాం.
చిన్న చిత్రాల పెద్ద పోటీ మధ్య ఉషా పరిణయంని తీసుకొస్తున్నారు విజయ్ భాస్కర్. క్లీన్ మూవీగా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు వారాల గ్యాప్ లో పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీనికి ఓపెనింగ్స్ కీలకంగా మారబోతున్నాయి. కల్ట్ డైరెక్టర్ గా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన విజయ భాస్కర్ కు ఉషా పరిణయం కొడుకుకో హిట్ ఇవ్వడంతో పాటు ఆయనకూ కొత్త ఇన్నింగ్స్ కి దారివ్వాలి. అది ఎంత వరకు నెరవేరుతుందో ఈ శుక్రవారం తేలనుంది. తన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా నటించింది.