OG రాజీపడక తప్పదేమో

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారికంలోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు డిప్యూటీ సిఎంగా అటు కీలక శాఖలకు మంత్రిగా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పట్లో సినిమాల ఊసే లేదనేంత టైట్ గా మీటింగులు, పర్యటనలు, చర్యలతో కాలం గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఒక్క నెల రోజులు డేట్లు ఇస్తే చాలు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు, ఓజిల పరిస్థితి ఇంకొంత కాలం ఇలాగే కొనసాగేలా ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్న ఓజి ఒక్క విషయంలో రాజీ పడక తప్పేలా లేదు.

దర్శకుడు సుజిత్ ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారమైతే ఓజి రెండు భాగాలట. అయితే ఇప్పుడు పవన్ కు సమయం బంగారం కన్నా విలువైందిగా మారిపోయింది. అలాంటప్పుడు సీక్వెల్స్ కి టైం దొరక్కపోవచ్చు. ఓజి ఇప్పటిదాకా జరిగిన షూట్ ప్రకారం ఒక్క పార్ట్ కు మాత్రమే సరిపోయేలా ఉందట. ఎలాగూ పవన్ డేట్లు అంత సులభంగా దొరికే సీన్ లేదు కాబట్టి నిర్మాత డివివి దానయ్య ఒక్క ఓజితోనే సర్దుకోవడానికి సిద్ధపడినట్టు సమాచారం. అయితే రెండు భాగాలనే ప్రస్తావన గతంలో అధికారికంగా రాలేదు కానీ టీమ్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం సబ్జెక్టులో అంత స్కోప్ అయితే ఉందట.

ఎలా చూసినా ఓజి షూటింగ్ ఎప్పుడు రీ స్టార్ట్ చేసినా 2025 వేసవి లేదా ఆ తర్వాత మాత్రమే విడుదలకు ఛాన్స్ ఉంది. అంతకన్నా ముందు ఆశించలేం. ఇంకోవైపు నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లుని డిసెంబర్ లో తేవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. అదే జరిగితే మార్చి లేదా ఏప్రిల్ చూసుకోవాలి. అప్పుడు ఓజి మరింత ఆలస్యమవుతుంది. వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి కొంత కాలం మర్చిపోవడం బెటర్. పాలనలో తన అవసరం ఎంత ఉందో గుర్తించిన పవన్ కొత్త సినిమాలకు ఎలాంటి కమిట్ మెంట్లు ఇచ్చే మూడ్ లో ప్రస్తుతానికి లేరని సన్నిహితుల మాట.