డబుల్ ఇస్మార్ట్.. రగడ తప్పదా?

ఇక ముగిసిందనుకున్న పూరి జగన్నాథ్ కెరీర్‌కు గొప్ప ఊపునిచ్చిన సినిమా.. ఇస్మార్ట్ శంకర్. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. టైర్-2 హీరోల సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిజానికి కంటెంట్ పరంగా చూస్తే పూరి ఒకప్పుడు తీసిన బ్లాక్‌బస్టర్లతో పోల్చడానికి వీల్లేని సినిమానే అయినా.. ఆ సమయానికి అన్నీ కలిసొచ్చి పెద్ద హిట్టయిపోయింది.

దీంతో విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ యంగ్ హీరోతో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని లైన్లో పెట్టాడు పూరి. దీనికి మంచి హైపే వచ్చింది. కానీ సినిమాలో విషయం లేకపోవడంతో పెద్ద డిజాస్టర్ అయింది. ఆ సినిమాను మంచి మంచి రేట్లకే అమ్మాడు పూరి. తీరా చూస్తే సినిమాకు కలెక్షన్లు రాలేదు. సినిమాను కొన్నవాళ్లందరూ మునిగిపోయారు. వాళ్లంతా తమకు సెటిల్మెంట్ చేయాలని రోడ్డుకెక్కారు. కానీ పూరి ఆ టైంలో ఏమీ చేయలేకపోయాడు. ఓటీటీ హక్కులు, ఇతర మార్గాల్లో తనకు రావాల్సిన డబ్బులే పూర్తి స్థాయిలో రాలేదంటూ పూరి తన వెర్షనేదో చెప్పుకున్నాడు. చాలా రోజుల పాటు ఈ పంచాయితీ నడిచింది.

ఇక కొత్త సినిమా తీసి అందరికీ సెటిల్ చేయడం తప్ప పూరికి మార్గం లేకపోయింది. ఆ ప్రకారమే ‘డబుల్ ఇస్మార్ట్’ మొదలుపెట్టాడు. సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. మామూలుగా ఇండస్ట్రీ సంప్రదాయాల ప్రకారం ఒక నిర్మాత తీసిన సినిమా వల్ల బయ్యర్లు భారీగా నష్టపోతే.. తర్వాతి చిత్రాన్ని తక్కువ రేట్లకు వాళ్లకే అమ్మాలి. కానీ పూరి అలా చేయట్లేదు. ‘హనుమాన్’ నిర్మాతలకు సినిమాను అమ్మాడు. ముందే డబ్బులన్నీ ఇచ్చేలా కాకుండా.. కొంచెం భిన్నంగా అగ్రిమెంట్లేవో జరిగినట్లు చెబుతున్నారు. కాబట్టి ముందే మొత్తం పేమెంట్ పూరి చేతికందదు. మరి ‘లైగర్’ బాధితులు ఇప్పుడేం చేస్తారన్నది ఆసక్తికరం. వాళ్లు పూరి తర్వాతి సినిమా రిలీజ్ కోసమే ఎదురు చూస్తున్నారు. రిలీజ్ ముంగిట తమ సెటిల్మెంట్ కోసం వాళ్లు పేచీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ పంచాయితీ ఇండస్ట్రీ పెద్దల వరకు వెళ్లింది. కానీ తనను బ్లాక్‌మెయిల్ చేస్తే ఎవరికీ రూపాయి ఇవ్వనంటూ పూరి అప్పట్లో తేల్చి చెప్పేశాడు.

ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజై పూరికి పూర్తి స్థాయిలో డబ్బులు అందే వరకు ఆయన్ని నమ్మి ‘లైగర్’ బాధితులు ఎదురు చూస్తారా.. లేక ఈ సినిమా రిలీజ్ ముంగిట పంచాయితీకి దిగుతారా అన్నది ప్రశ్న. ఒకవేళ ‘డబుల్ ఇస్మార్ట్’ సరిగా ఆడని పక్షంలో ఏంటి పరిస్థితి అన్నది కూడా చూడాలి. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ ఏ ఇబ్బందీ లేకుండా రిలీజవుతుందా అనేది సందేహమే.