ఇది సోషల్ మీడియా కాలం. చిన్న సినిమాలకు మార్కెటింగ్ ప్రాణ సంకటంగా మారిపోయింది. చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక నరకంగా ఒక్కోసారి ఈ ట్రెండ్ అర్థం చేసుకోలేక నిర్మాతలు కన్ఫ్యూజవుతుంటారు. కానీ పబ్లిసిటీ అనేది ఎలా చూసుకున్నా కీలకమే.
లిటిల్ హార్ట్స్ నిర్మాణం కోసం పెట్టిన బడ్జెట్ కన్నా ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చే ఎక్కువ. దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నారు. ఈ మధ్య ఇతర కొత్త రిలీజులు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ఒకటి హే బలవంత్. ఈ శుక్రవారం ఫిబ్రవరి 20 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద క్రమంగా ఫోకస్ పెరుగుతున్న వైనం గమనించవచ్చు.
ముందు హే భగవాన్ టైటిల్ పెట్టుకుని ఆడియెన్స్ ని ఆకర్షించాక సెన్సార్ అభ్యంతరంతో దాన్ని హే బలవంత్ గా బలవంతంగా మార్చడం గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సరే పేరులో ఏముంది, కంటెంట్ బాగుంటే జనాలు చూస్తారనే నమ్మకంతో నిర్మాతలు దాన్ని లైట్ తీసుకున్నారు.
అసలే ఫిబ్రవరి చాలా డ్రైగా వెళ్తోంది. ఫంకీ మొదటి రోజే తేలిపోగా పాజిటివ్ టాక్ వచ్చిన కపుల్ ఫ్రెండ్లి ఓ మోస్తరుగా బండి లాగుతోంది తప్పించి అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ పెట్టేంత రేంజ్ లో అయితే కాదు. అందుకే హే బలవంత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తోంది. కనెక్ట్ అయితే హిట్టు కొట్టొచ్చు.
హీరో సుహాస్ కు హే బలవంత్ హిట్ కావడం చాలా అవసరం. ఆ మధ్య వరసగా సినిమాలు చేసి హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు చవిచూసిన ఈ టాలెంటెడ్ హీరో తమిళంలో మందాడితో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
టాలీవుడ్ లో హీరోగా ఆఫర్లు వస్తున్న టైంలో ఇలా హఠాత్తుగా కోలీవుడ్ కు వెళ్ళడం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్న అడిగినప్పుడు మంచి కథ అయితే ఏ లాంగ్వేజ్ అనేది పట్టించుకోనని, త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ కథతో ఆయన అసిస్టెంట్ దర్శకత్వం వహించబోయే సుహాస్ మరో సినిమా ప్రారంభం కానుందని చెప్పుకొచ్చాడు. వీటికన్నా ముందు హే బలవంత్ సక్సెస్ కావడం చాలా ముఖ్యం. రేపే ప్రీమియర్లు ఉండబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates