లవ్ స్టోరీని లైట్ తీసుకున్న ప్రేక్షకులు

ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే. పదేళ్లు పూర్తయ్యాయి కాబట్టి వర్కౌటవుతుందేమోనని భావించిన నిర్మాతలకు చిన్న షాక్ తగిలింది. ఇలా జరగడానికి కారణాలు ఉన్నాయి.

లవ్ స్టోరీ ఒక సిన్సియర్ అండ్ సెన్సిటివ్ కాన్సెప్ట్. ఫ్యాన్ కంటెంట్ పెద్దగా ఉండదు. సారంగదరియా పాటతో పాటు మరో రెండు సాంగ్స్ విజువల్ గా ఆకట్టుకుంటాయి తప్పించి థియేటర్లలో ఈలలు, గోలలు చేసే ఎపిసోడ్స్ ఉండవు. నాగచైతన్య, సాయిపల్లవి జంట ఎంత కంటికి ఇంపుగా ఉన్నా మాస్ మూమెంట్స్ లేకపోవడం రిపీట్ వేల్యూ తగ్గించింది.

అయినా సరే రిస్క్ చేసి లవ్ స్టోరీని మళ్ళీ విడుదల చేయడం ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. విచిత్రంగా ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వేకు స్పందన బాగుంది. రెండు రోజులకే హడావిడి పరిమితమైనా వీకెండ్ మెయిన్ సెంటర్స్ లో చెప్పుకోదగ్గ ఆక్యుపెన్సీలు కనిపించాయి.

దీనికేం విపరీతమైన ప్రమోషన్లు చేయలేదు. జస్ట్ సోషల్ మీడియా ట్వీట్లతో పని కానిచ్చేశారు. మనసంతా నువ్వే ఇంతగా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. ఉదయ్ కిరణ్, మనసారా నవ్వుకునే క్లీన్ కామెడీ, ఆర్పి పట్నాయక్ అద్భుతమైన పాటలు, ఆర్టిస్టుల నటన ఒకటేమిటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ మనసంతా నువ్వేలో ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. కొత్త రిలీజులకే వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఫంకీ పోరాడుతుండగా ఫ్రెండ్లీ కపుల్ కొచ్చిన మంచి టాక్ పూర్తి స్థాయి కలెక్షన్లుగా మారలేకపోతోంది. అలాంటిది ఫిబ్రవరి లాంటి డ్రై మంత్ లో పాత సినిమాలతో జనాలను రప్పించడం చాలా కష్టం.

రీ రిలీజ్ ఏదైనా సరే కనీసం ఇరవై సంవత్సరాల గ్యాప్ ఉంటే నోస్టాల్జిక్ ఫీలింగ్ కోసం జనం థియేటర్లకు వస్తారు. అలా కాకుండా ఒరిజినల్ 4కె ఓటిటిలో, ఆన్ లైన్ లో దొరుకుతున్నప్పుడు మళ్ళీ అదే ఎక్స్ పీరియన్స్ కోసం టికెట్లు కొనరు. ఒకరకంగా చెప్పాలంటే ఇకపై డిస్ట్రిబ్యూటర్లు లవ్ స్టోరీని ఒక కేస్ స్టడీగా పరిగణిస్తే మేలు.