పేకమేడలు రిపోర్ట్ ఏంటి

నిన్న శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల యుద్ధం జరిగింది. ఎవరికి వారు ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సోషల్ మీడియాలో వీటికి సంబంధించి సౌండ్ బాగానే వినిపించింది. దానికి తోడు ముందు రోజే పోటాపోటీగా ప్రీమియర్లు వేసుకోవడం జనంలో ఆసక్తిని పెంచింది.

హైప్ పరంగా ప్రియదర్శి డార్లింగ్ ముందుండగా తర్వాతి స్థానంలో పేకమేడలు నిలిచింది. నా పేరు శివ, గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో విలన్ గా నటించిన వినోత్ కిషన్ హీరోగా రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాకు నీలగిరి మామిళ్ళ దర్శకుడు. ఎవరికి చెప్పొద్దు అందించిన సంస్థ నుంచి వచ్చిన ఈ మూవీ రిపోర్ట్ ఏంటంటే.

మందు, జూదం లాంటి వ్యసనాలకు అలవాటు పడిన లక్ష్మణ్ (వినోత్ కిషన్) చేతిలో బిటెక్ చదువు, కుటుంబ అండదండలు ఉన్నా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సులభంగా డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టి భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) సంపాదన మీదే రోజులు వెల్లదీస్తూ ఉంటాడు.

ఇంటా బయటా బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న లక్ష్మణ్ లైఫ్ లో ఎన్ఆర్ఐ శ్వేతా (రేతిక శ్రీనివాస్) వస్తుంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెను ట్రాప్ చేయడం ద్వారా జీవితాన్ని సెటిల్ చేసుకోవచ్చని భావించి ఒక ప్లాన్ వేస్తాడు. అటుపై ఆ ఫ్యామిలీలో జరిగే పరిణామాలే కథ.

తీసుకున్న పాయింట్ లో మంచి వెయిట్ ఉన్నా దాన్ని ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలచడంలో నీలగిరి తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అధిక శాతం రాజరాజ చోరను గుర్తుకు తెస్తుంది. బలమైన సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ లో జొప్పించిన ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో పండకపోవడంతో ఎక్కడిక్కడా పర్వాలేదనే ఫీలింగ్ కలిగించినా ఫైనల్ గా బాగుందని అనిపించడంలో మాత్రం దర్శకుడు ఫెయిలయ్యాడు.

కారణం పాత్రల మీద పెట్టిన దృష్టి కథనం మీద లేకపోవడమే. ఆర్టిస్టులు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పేకమేడలు కట్టడమైతే చేశారు గాలికి నిలబడేంత పటిష్టంగా లేదు.