ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద పాయల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ లాంటి సినిమాల్లో నటించిన పాయల్.. గతంలో అనురాగ్ తనకు అవకాశమిస్తానని పిలిచి, ఓ గదికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ ఆరోపణల విషయమై కంగనా రనౌత్ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే చాలామంది అనురాగ్ వైపే నిలిచారు. అందులో తాప్సి పన్ను కూడా ఒకరు. పాయల్ పేరెత్తకుండా, ఆమె ఆరోపణల గురించి ప్రస్తావించకుండా కశ్యప్‌కు మద్దతిచ్చిన తాప్సి.. తాజాగా ఈ విషయమై మరింత ఓపెన్ అయింది.
కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు విని తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పిన తాప్సి.. ఆ ఆరోపణలు నిజమైతే కశ్యప్‌తో అన్ని సంబంధాలు తెంపుకునే మొదటి వ్యక్తి తానేనంటూ శపథం చేసింది. లైంగిక ఆరోపణలు వచ్చిన వెంటనే కశ్యప్‌కు మద్దతుగా మాట్లాడిన మొదటి వ్యక్తి కూడా తాప్సినే. తనకెప్పుడూ కశ్యప్ అలాంటి వాడిలా కనిపించలేదని, తనకు తెలిసిన వ్యక్తుల్లో కశ్యపే అతిపెద్ద ఫెమినిస్టు అని తాప్సి కితాబిచ్చింది. ఎవరిపైనైనా లైంగిక హింస జరిగినట్లైతే దానిపై విచారించడానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయని.. అంతే కానీ ఎవరికి వాళ్లు తీర్పులు ఇవ్వకూడదని తాప్సి అంది. దశాబ్దాల అణచివేత తర్వాత మీటూ ఉద్యమం కారణంగా తమ బాధను, తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకునే అవకాశం మహిళలకు దొరికిందని.. ఐతే దీన్ని తప్పుదారి పట్టిస్తే అసలుకే మోసం వస్తుందని.. బాధితులకు న్యాయం జరగదని వ్యాఖ్యానించడం ద్వారా పాయల్‌కు పరోక్షంగా చురకలు అంటించింది తాప్సి.