దేవిశ్రీప్రసాద్ మొదటిసారి ఇండియా లైవ్

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు కానీ సరైన దర్శకుడు, ఆల్బమ్ పడితే దుమ్ము దులుపుతాడనే సంగతి తెలిసిందే. పుష్ప 2 ది రూల్ నుంచి రెండు ఆడియో సింగల్స్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. పాతికేళ్లకు పైగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న దేవి టాలీవుడ్ లో చిరంజీవితో మొదలుకుని మహేష్ బాబు దాకా ప్రతి అగ్ర హీరోకి మర్చిపోలేని పాటలిచ్చాడు. విదేశాల్లో చెప్పుకోదగ్గ లైవ్ షోలు చేసిన డిఎస్పి ఇప్పటిదాకా ఇండియాలో లైవ్ కన్సర్ట్ చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది నిజం. అభిమానులు ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది.

మొట్టమొదటిసారి దేవిశ్రీప్రసాద్ ఇండియా టూర్ చేయబోతున్నాడు. అందులో భాగంగా అక్టోబర్ 19 హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యక్షంగా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు. టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టారు. 999 రూపాయలతో మొదలుపెట్టి 24999 రూపాయల దాకా అన్ని వర్గాల అభిమానులకు తగట్టు ధరలు నిర్ణయించారు. సమయం, నిడివి తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఓవర్సీస్ లో ఇలాంటి ప్రోగ్రాంస్ గతంలో దేవి చాలానే చేశాడు. అన్నీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకున్నవే. కాకపోతే ఏపీ, తెలంగాణలో ఇప్పటిదాకా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.

నిజం చెప్పాలంటే దేవి ఎప్పుడో ఇలాంటివి చేసుకుండాల్సింది. ఇళయరాజా గత పదేళ్లలో మూడుసార్లు భాగ్యనగరంలో లైవ్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ ది అయ్యింది. త్వరలో యువన్ శంకర్ రాజా రాబోతున్నాడు. హరీష్ జైరాజ్ ది ప్లానింగ్ లో ఉంది. మరి ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ లో భాగమైన దేవి ఇంత లేట్ గా ఇక్కడ షో చేయడం గమనార్హం. పుష్ప 2 ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, తండేల్ లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ తో ఇంత పోటీలోనూ బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ నుంచి క్లాసిక్ సాంగ్స్ ని ప్రత్యక్షంగా చూస్తూ వినే అవకాశాన్ని ఫ్యాన్స్ ఏ మేరకు అందిపుచ్చుకుంటారో చూడాలి.