తెలుగులో థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీ రిలీజ్‌కు వెళ్లిన వాటిలో అత్యంత పెద్ద సినిమా అంటే.. ‘వి’నే. ఆ సినిమాపై ఇటు సినీ పరిశ్రమ, అటు ప్రేక్షకులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రం మీద అమేజాన్ ప్రైమ్ ఏకంగా రూ.32 కోట్ల పెట్టుబడి పెట్టడం గమనార్హం.
బడ్జెట్ మీద మంచి లాభానికే దిల్ రాజు ఈ సినిమాను అమ్ముకున్నాడు. ఇతర హక్కులు కూడా కలిపితే రాజుకు రూ.10 కోట్ల దాకా లాభం దక్కినట్లు సమాచారం. ఐతే ‘వి’ మీద పెట్టిన పెట్టుబడికి తగ్గ ప్రయోజనం అమేజాన్ వాళ్లకు దక్కలేదు. దీంతో ఇకపై కొత్త సినిమాలను కొనే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ప్రైమ్ వాళ్లు డిసైడయ్యారు. ఈ ప్రభావం ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న కొత్త సినిమాలపై పడింది.
‘వి’ తర్వాత రిలీజవుతున్న మరో పెద్ద సినిమా ‘నిశ్శబ్దం’కు మొదట్లో ఆఫర్ చేసిన రేటు రూ.30 కోట్ల పైనే కాగా.. ఇప్పుడు రూ.24 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్ల దాకా అయింది. ఇంతకుముందు పెట్టుబడి మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌తోనే వచ్చేసేది. కానీ ఆలస్యం చేయడం వల్ల, ‘వి’ ప్రభావం కూడా పడి రూ.24 కోట్లే ముట్టాయి. అంటే రూ..6 కోట్ల డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నమాట. సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నదాన్ని బట్టి శాటిలైట్, డబ్బింగ్, ఇతర హక్కులతో ఆ లోటును పూడ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ సినిమాకు సరైన స్పందన లేకుంటే మున్ముందు రిలీజయ్యే కొత్త చిత్రాలపైనా ఆ ప్రభావం పడుతుంది. సోలో బ్రతుకే సో బెటర్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా లాంటి చిత్రాలు డిజిటల్ రిలీజ్ కోసం లైన్లో ఉన్నాయి. వాటికి ఇంకా డీల్స్ పూర్తి కాలేదు. ‘నిశ్శబ్దం’తో పాటు అక్టోబరు 2న ఒరేయ్ బుజ్జిగా రిలీజవుతుండగా.. 23న ‘కలర్ ఫొటో’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.