ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ జపాన్ లో మాత్రం ఆరు నెలలు ఆలస్యంగా ప్రేక్షకులను పలకరించింది. సాంకేతిక మరియు సంస్థాగత కారణాల వల్ల భారతీయ సినిమాలను అన్ని దేశాలతో పాటు జపాన్ లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ఛాన్స్ ఉండదు. అయితే ఇంత లేట్ అయినా కూడా అక్కడి ఆడియన్స్ కి ప్రభాస్ కటవుట్ మరోసారి నచ్చేసిందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటిదాకా సుమారు 23 మిలియన్ల జపాన్ యెన్లు వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. యుఎస్ డాలర్ల లెక్కలో చూసుకుంటే 1 లక్ష 42 వేల డాలర్లు అవుతుంది.
ఇంకా మొదటి వారం పూర్తి కాకపోవడంతో 28 మిలియన్ జపాన్ యెన్లు దాకా చేరుకోవచ్చు. ఇప్పటిదాకా ఆ దేశంలో ఫస్ట్ వీక్ అత్యధిక ఓపెనింగ్ వసూలు చేసిన వాటిలో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉంది. దానికొచ్చిన మొదటి వారం గ్రాస్ కలెక్షన్ 44 మిలియన్ జపాన్ యెన్లకు పైనే. ఆ తర్వాత స్థానం సాహో పేరు మీద ఉంది. 23 మిలియన్ల దాకా రాబట్టింది. సలార్ దాన్ని దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాహుబలి కన్నా వీటికే మెరుగైన ఫిగర్లు నమోదు కావడం గమనించాల్సిన విషయం. అయితే ఆర్ఆర్ఆర్ ఫైనల్ జపాన్ కలెక్షన్ సుమారు 1955 మిలియన్ యెన్లు. దీన్ని అందుకోవడం మాత్రం సలార్ కు జరగని పని.
లెక్కల సంగతి పక్కనపెడితే సలార్ కొచ్చిన మిక్స్డ్ టాక్ ప్రకారం చూసుకుంటే జపాన్ లోనూ బ్లాక్ బస్టర్ కింద పరిగణించాలి. ప్రభాస్ ప్రత్యేకంగా ఒక వీడియో బైట్ మరీ ప్రమోషన్లలో పాల్గొన్నాడు. దీనికే ఇలా ఉంటే కల్కి 2898 ఏడికి జపాన్ దేశంలో ఏ స్థాయిలో స్పందన ఉంటుందో చెప్పడం కష్టం. త్వరలో ప్లాన్ చేయబోతున్నారు కానీ ఎంతలేదన్నా డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కావొచ్చు. మరి ఓటిటిలో వచ్చేసి ఉంటుందనే అనుమానం అక్కర్లేదు. జపాన్ లో ఓటిటిలు, పైరసీలు అన్నీ కఠిన నియంత్రణలో ఉంటాయి. ఏం చేసినా అనఫీషియల్ వెర్షన్లు చూడటం అసాధ్యం.