వరలక్ష్మి పెళ్లి ఖర్చు గురించి ఇదేం ప్రచారం

కెరీర్ మొదలుపెట్టింది తమిళంలోనే అయినా తెలుగులోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా వరస అవకాశాలు దక్కించుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దక్షిణాది పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలెందరో వేడుకకు హాజరయ్యారు. ఈ జంటకు సంబంధించి మొదటిసారి ఫోటోలు బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగానే చర్చ జరిగింది. మొదటిసారి పెళ్ళై కూతురు కూడా ఉన్న ఉన్న నికోలాయ్ సచ్ దేవ్ ని తన జీవిత భాగస్వామిగా వరలక్ష్మి ఎంచుకోవడం పట్ల జనాల్లో ఆశ్చర్యం ఎక్కువగా వ్యక్తమయ్యింది.

ఇదిలా ఉండగా ఈ వేడుకకు తండ్రి శరత్ కుమార్, పినతల్లి రాధికలు రెండు వందలు కోట్లు ఖర్చు పెట్టారని కొన్ని మీడియా వర్గాల్లో రావడం హాట్ టాపిక్ గా మారింది. దానికాయన స్పందించారు. అసలు అంత డబ్బు ఒక పెళ్లికి ఖర్చు పెడతారని ఎలా అనుకుంటారని, నేనైతే వీలైనంత సింపుల్ గా చేశానని, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నికోలాయ్ స్వతహాగా ధనవంతుడు. ముంబైలో చాలా పలుకుబడి, నెట్ వర్క్ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ తొమ్మిది వందల కోట్ల దాకా ఉండొచ్చనే టాక్ ఉంది. దాంతో సహజంగానే పెళ్లి మీద ఇలాంటి న్యూస్ వచ్చాయి.

ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి షూటింగుల్లో పాల్గొనబోతోంది. గత కొన్నేళ్లలో తన డిమాండ్ చాలా పెరిగింది. వీరసింహారెడ్డిలో లేడీ విలన్, శబరిలో టైటిల్ పాత్రధారి, నాందిలో లాయర్, యశోదలో ప్రతి నాయకురాలిగా ఇలా రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. తెలుగు తమిళంలో కలిపి పదికి పైగానే రిలీజ్ కు సిద్ధంగా, నిర్మాణం జరుగుతున్నవి ఉన్నాయి. ఇప్పుడు గృహిణిగా కొత్త బాధ్యత వచ్చినా కాజల్ అగర్వాల్ తరహాలో ఒకపక్క నటిస్తూనే మరోపక్క కెరీర్ ని సెట్ చేసుకునే ప్లాన్ లో ఉంది వరలక్ష్మి శరత్ కుమార్.