ఎన్టీఆర్ కొత్త సినిమా.. బుస్సేనా?

ప్రస్తుతం టాలీవుడ్లో డైరీ అస్సలు ఖాళీ లేని హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. తన కొత్త చిత్రం ‘దేవర’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఇది కాక రెండు పాన్ ఇండియా సినిమాలను అతను లైన్లో పెట్టాడు. ఇలాంటి టైంలో తారక్ కొత్త చిత్రం గురించి నిన్న సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం నడిచింది. ‘హాయ్ నాన్న’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన శౌర్యువ్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడని.. ‘హాయ్ నాన్న’ను నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్సే భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందని వార్తలు ఊపందుకున్నాయి.

ఐతే హాయ్ నాన్న లాంటి సాఫ్ట్ మూవీ తీసిన శౌర్యువ్‌.. మాస్ హీరో అయిన తారక్‌తో ఎలాంటి సినిమా తీస్తాడా అన్న ఊహాగానాల్లోకి అభిమానులు వెళ్లిపోయారు. ఈ కలయిక విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లూ లేకపోలేదు.

ఐతే తారక్-శౌర్యువ్-వైరా సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నది కేవలం ఊహాగానాలే అని తారక్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి కాంక్రీట్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. అడ్వాన్సులివ్వడం, కమిట్మెంట్ తీసుకోవడం లాంటివేమీ జరగలేదట. జస్ట్ తారక్ ముందుకు ఒక ప్రపోజల్ మాత్రమే వెళ్లిందని, చూద్దాం అని మాత్రమే తారక్ అన్నారని.. ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని.. కానీ ఈలోపే సినిమా ఓకే అయిపోయినట్లు ప్రచారం జరిగిపోయిందని అంటున్నారు.

తారక్ ప్రస్తుతం ‘దేవర’తో పాటు ‘వార్-2’ సినిమాలో సమాంతరంగా నటిస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ ఉండనే ఉంది. ఇవి కాక మరో పాన్ ఇండియా సినిమా కూడా ప్లానింగ్‌లో ఉందంటున్నారు. ఈ చిత్రాలన్నీ అయితే కానీ.. వైరా వాళ్లతో సినిమా గురించి స్పష్టత రాదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు ఊహాగానాలే అంటున్నారు.