జై హనుమాన్….అన్నీ ఊహాగానాలే

2024లో కల్కి 2898 ఏడి కన్నా ముందు టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఎప్పుడు మొదలవుతుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నా అది కాస్తా క్యాన్సిల్ కావడంతో నెలల తరబడి సమయం వృథా అయిపోయింది. జై హనుమాన్ కు సంబంధించిన స్క్రిప్ట్ మీద ఇంకా ప్రాధమిక దశలోనే వర్క్ చేస్తున్న ప్రశాంత్ వర్మ దాన్ని పూర్తిగా కొలిక్కి తేవడానికి సంవత్సరం దాకా పడుతుందని భావిస్తున్నాడట. సో ఆలస్యం తప్పదు.

తాజాగా హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి తర్వాతి భాగంలో హనుమంతుడిగా రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ టాపికయ్యింది. దీనికి అవకాశాలు చాలా తక్కువే అయినప్పటికీ మెగా ఫాన్స్ మాత్రం నిజమవ్వాలని కోరుకుంటున్నారు.

కనీసం రెండేళ్లు నిర్మాణం చేయనిదే అంచనాలకు తగ్గట్టు జై హనుమాన్ ని రూపొందించడం కష్టం. అంతకన్నా ముందు ప్రశాంత్ వర్మ ముందున్న పెద్ద సవాల్ క్యాస్టింగ్. హనుమంతుడు, రాముడు, రావణుడు, సీత ఇలా కీలక పాత్రధారులకు స్టార్ తారాగణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

సో ఇప్పుడప్పుడే జై హనుమాన్ కార్యరూపం దాల్చడం కుదరదు. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ మనసులో ఏం ప్లాన్లున్నాయో బయట పడటం లేదు. నందమూరి మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణ ఈయనకే అప్పగించారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

సినిమాటిక్ యునివర్స్ ని విస్తరించే పనిలో ఉన్న ప్రశాంత్ వర్మ రాబోయే రోజుల్లో తాను రాసుకున్న సూపర్ హీరోల కథలను ఇతర దర్శకులతోనూ తెరకెక్కిస్తానని చెబుతున్నారు. జై హనుమాన్, ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమా ఈ రెండు విషయాల పట్ల స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం ఆగక తప్పేలా లేదు.