మాస్ మహారాజాకు మళ్ళీ పోటీ తప్పదా

హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన మిస్టర్ బచ్చన్ విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా చాలా మార్పులు చేసిన వైనం ఆ మధ్య వదిలిన చిన్న టీజర్ లో బయట పడింది. దీంతో అంచనాలు పెరగడంతో పాటు బిజినెస్ ఆఫర్లు బాగా వస్తున్నాయట. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే ధమాకా టైంలో శ్రీలీల ఎలా అయితే హైప్ కు ఉపయోగపడిందో ఇప్పుడు రవితేజతో పాటు కొత్తమ్మాయి కూడా ఆ బాధ్యత తీసుకునేలా కనిపిస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ఆగస్ట్ 15 లాక్ చేసుకున్నారని తెలిసింది. అయితే అదే డేట్ ని ఇప్పటికే రామ్ డబుల్ ఇస్మార్ట్ తీసేసుకుంది. రెండు చిన్న సినిమాలు 35 చిన్న కథ కాదు, ఆయ్ అనౌన్స్ మెంట్ ఇచ్చాయి. ఒకవేళ రవితేజ రావడం కన్ఫర్మ్ అయితే వీటిలో ఒకటి లేదా రెండూ తప్పుకునే ఛాన్స్ కొట్టి పారేయలేం. కానీ కాంపిటీషన్ లేకుండా రావాలని చూస్తున్న మిస్టర్ బచ్చన్ కు ఆ ఆప్షన్ లేకపోవచ్చు. ఎందుకంటే డబుల్ ఇస్మార్ట్ వాయిదా పడే సమస్యే లేదని తెలుస్తోంది.

గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు టైంలోనూ రవితేజ ఒకేసారి బాలకృష్ణ, విజయ్ లతో తలపడాల్సి వచ్చింది. దసరా పండక్కు ఆడియన్స్ ఈ ట్రయాంగిల్ వార్ చూశారు. ఈగల్ సంక్రాంతి నుంచి తప్పుకోవడం వల్ల ఫిబ్రవరిలో రిలీజయ్యింది. ఒకవేళ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కనక స్వాతంత్ర దినోత్సవానికి ఫిక్స్ చేసుకుంటే మాత్రం కాంపిటీషన్ తప్పదు. లేదూ అంటే ఆగస్ట్ మూడో వారానికి వెళ్లాల్సి ఉంది. తిరిగి లాస్ట్ వీక్ లో నాని సరిపోదా శనివారం ఉంది కాబట్టి ఎటు తిరిగి క్లాష్ కాక తప్పేలా లేదు. 90ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఆదాయపన్ను అధికారిగా కనిపించబోతున్నాడు.