కమర్షియల్ జానర్ జోలికి వెళ్లకుండా కాస్త విభిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటున్న సుహాస్ త్వరలో జనక అయితే కనకతో థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తండ్రి పేరు మీద స్థాపించిన బ్యానర్ మొదటి చిత్రమే బలగం రూపంలో బ్లాక్ బస్టర్ అందుకోగా ఇటీవలే వచ్చిన లవ్ మీ ఇఫ్ యు డేర్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. హారర్ ఎలిమెంట్స్ జనాలకు ఎక్కలేదు. అందుకే ఈసారి క్లీన్ ఎంటర్ టైన్మెంట్ వైపు వచ్చేశారు. సందీప్ బండ్ల దర్శకత్వంలో రూపొందిన జనక అయితే కనక టీజర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
స్టోరీ ఏంటో దాచే ప్రయత్నం చేయలేదు. చిన్న ఉద్యోగంతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్న ఓ కుర్రాడి(సుహాస్)కి పెళ్లవుతుంది. భార్య(సంగీర్తన) అడుగుపెట్టాక బడ్జెట్ ని తట్టుకుంటూ ఏదోలా మేనేజ్ చేసుకునే క్రమంలో పిల్లలు పుడితే ఆ ఖర్చులు భరించలేమని ఆ ఆలోచనకు దూరంగా ఉంటాడు. ఇంట్లో తండ్రి, నాన్నమ్మ ఎంత గోల పెడుతున్నా పట్టించుకోడు. ఆఫీస్ లో ప్రమోషన్ లేక, జీతం పెరగక ఏవో తిప్పలు పడుతూ ఉంటాడు. జనకుడు కావడమే వద్దనుకున్న మధ్య తరగతి ఉద్యోగి జీవితం చివరికి ఏ మలుపు తిరిగిందనేది తెరమీద చూడమంటున్నారు దర్శక నిర్మాతలు.
కాన్సెప్ట్ వెరైటీగా అనిపించడంతో పాటు సరదాగా నవ్వుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ని సందీప్ బాగానే దట్టించినట్టు ఉంది. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చగా సాయి శ్రీరాం ఛాయాగ్రహణం సమకూర్చారు. మిడిల్ క్లాస్ ఫాదర్ గా మరోసారి గోపరాజు రమణనే తీసుకోవడం బాగుంది. హీరోయిన్ గా సంగీర్తనని పరిచయం చేస్తున్నారు. విడుదల తేదీ ఇంకా నిర్ధారణ కాని జనక అయితే కనకను ఈ నెలాఖరు లేదా ఆగస్ట్ లో రిలీజ్ చేసే ఆలోచన జరుగుతోంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు తర్వాత శ్రీరంగనీతులు నిరాశ పరచడంతో సుహాస్ ఈసారి ఈ జనక మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates