బాలీవుడ్‌లో డ్రగ్ రాకెట్‌ను ఛేదించే విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కొంచెం గట్టిగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో పాటు సరఫరాలోనూ పాలుపంచుకుంటోందని ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తిని రెండు వారాల కిందట అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె పలువురు తారల పేర్లు బయట పెట్టినట్లు వార్తలొచ్చాయి. డ్రగ్స్ వాడిన వాళ్లుగా రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్, దీపికా పదుకొనే, దియా మీర్జా తదితరుల పేర్లు మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే వీరిలో చాలామంది ఈ ఆరోపణలపై ఎక్కడా ఏమీ మాట్లాడకుండా గప్‌చుప్ అన్నట్లున్నారు. తమ పని తాము చేసుకుపోతున్నారు. ఐతే లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్లు సైలెంటుగా ఉండగా.. ఒకప్పటి కథానాయిక దియా మీర్జా తనపై వచ్చిన ఆరోపణలపై ట్విట్టర్లో స్పందించింది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించింది. డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ వాడి ఎరుగనని.. వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఎప్పుడూ పాలుపంచుకున్నది లేదని ఆమె తేల్చి చెప్పింది. తనపై వచ్చినవన్నీ అబద్ధపు, నిరాధార ఆరోపణలని అన్న దియా.. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. కాగా 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు.. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ పోలీసు విచారణలో అంగీకరించినట్లు మీడియాలో ఇటీవల వార్తలొచ్చాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates