మాములుగా సంగీత దర్శకులు ఎవరైనా ఒక మహర్దశ అనుభవించాక క్రమంగా నెమ్మదించడం సహజం. చరిత్ర చెప్పేది ఇదే. బ్లాక్ అండ్ వైట్ కాలంలో సాలూరితో మొదలుపెట్టి ఇప్పుడు ఫామ్ లో ఉన్న తమన్ దాకా అందరికీ వర్తిస్తుంది.
ఒక రెండు మూడు దశాబ్దాలు చక్రం తిప్పగానే సృజనాత్మకత తగ్గిపోయి క్రమంగా అవకాశాలు నెమ్మదిస్తాయి. కానీ ఎంఎం కీరవాణి మాత్రం వేరనే చెప్పాలి. ఆయన సమకాలీకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లు ఇంకా పోటీలోనే ఉండొచ్చు. బోలెడు ఆఫర్లతో బిజీ కావొచ్చు. కానీ ఈ వయసులోనూ కీరవాణి లాగా ఆస్కార్ సాధించే పాటలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు.
ఇవాళ ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం కేవలం కీరవాణి పుట్టినరోజు కావడం ఒక్కటే కాదు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాక ఆరు పదుల వయసులోనూ మూడు అత్యంత ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా సినిమాలకు పని చేసే అదృష్టం దక్కించుకోవడం.
చిరంజీవి విశ్వంభర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడులను మించిన మ్యూజిక్ ఇస్తారనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు మొదటిసారి బాణీలు కడుతున్న హరిహర వీరమల్లు మీద అంచనాల గురించి మళ్ళీ కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశం మొత్తం ఎదురు చూస్తున్న మహేష్ రాజమౌళి కలయికలో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 హైప్ గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇంత వయసులోనూ కీరవాణి పడే కష్టం తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేసే మహద్భాగ్యాన్ని దక్కించింది.
ఒకప్పుడు మూడు షిఫ్టులు పని చేసినా సమయం సరిపోలేనంత బిజీని ఆస్వాదించిన కీరవాణి ఇప్పుడూ అదే శ్రమతో కష్టపడుతూనే ఉన్నారు. గాయకుడిగా, గీత రచయితగానూ తనదైన ముద్ర వేసిన మరగతమణి ఇప్పటికీ కుర్రకారుతో పోటీ పడుతూ తన సత్తా చాటుకోవడం ఎవ్వరికైనా స్ఫూర్తినిచ్చే ప్రయాణమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates