రెండు మూడేళ్ళ క్రితం వరకు సీనియర్ హీరో బాబీ డియోల్ కు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఒకటి అరా అవకాశాలు తప్పించి కెరీర్ బాగా నెమ్మదించిపోయింది. వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్ చేసినప్పటికీ వాటి ఫలితాలు అంతంత మాత్రమే. ఆశ్రమ్ ఒకటే పేరు తీసుకొచ్చింది. ఇక యానిమల్ ఈయన జీవితాన్ని అమాంతం మార్చేసింది. నాలుగు కోట్లు ఇవ్వడమే ఎక్కువనుకునే స్టేజి నుంచి ఇప్పుడు దానికి రెట్టింపు ఎనిమిది కోట్లు ఇస్తామన్నా అంత సులభంగా డేట్లు దొరికే పరిస్థితి లేదు. ఒక తెలుగు దర్శకుడి వల్ల బాలీవుడ్ యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ ఇంత ఉచ్చ స్థితికి చేరుకోవడం చిన్న విషయం కాదుగా.
ప్రస్తుతం బాబీ డియోల్ ఇటు సౌత్ అటు నార్త్ రెండు వైపులా ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సూర్య కంగువ లాంటి ప్యాన్ ఇండియా మూవీ ద్వారా దక్షిణాదిలో పరిచయం కావడం ఒక విశేషమైతే దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో ఔరంగజేబ్ గా కీలక పాత్ర దక్కించుకోవడం ఇంకో ఘనత. ఇవి చాలదన్నట్టు బాలకృష్ణ 109 ప్రతినాయకుడిగా బాబీ ఇతన్నే ఎంచుకున్నాడు. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా బాలీవుడ్ గురించి వేరే చెప్పాలా. యష్ రాజ్ ఫిలిమ్స్ అలియా భట్, శార్వరి వాఘ్ తో తీస్తున్న లేడీ స్పై మూవీలో ఇతనే మెయిన్ విలన్. మోహన్ లాల్ ఒప్పం హిందీ రీమేక్ లోనూ ఛాన్స్ కొట్టేశాడు.
ఇవి కాకుండా అనురాగ్ కశ్యప్ లాంటి కల్ట్ డైరెక్టర్లు తీస్తున్న సినిమాల్లోనూ భాగమవుతున్నాడు. అయితే బాబీ డియోల్ ఎక్కువగా తెలుగు తమిళ అవకాశాల మీద దృష్టి పెడుతున్నాడు. పారితోషికాలు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా క్రమశిక్షణ విషయంలో ఈ రెండు బాషల నిర్మాతలు కమిట్ మెంట్ లో ఉండటం మరో కారణం. వాయిదాలు ఇక్కడా ఉన్నప్పటికీ దానికి తగిన పరిహారం ముట్టజెప్పడంలోనూ మనవాళ్లే ముందున్నారు. ఒకవేళ సందీప్ రెడ్డి వంగా కనక యానిమల్ లో బాబీ డియోల్ ని తీసుకోకపోయి ఉంటే ఇన్ని నెలల తర్వాత కూడా ఈ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు.