దసరా ఇచ్చిన ధైర్యంతో వంద కోట్ల రిస్కు

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా ఇచ్చిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తిరిగి అదే బ్యానర్ లో ఇంకో ప్యాన్ ఇండియా సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం విడుదల కోసం ఎదురు చూస్తున్న నాని అది కాగానే కొత్త సెట్లో అడుగు పెడతాడు. సుమారు నూటా ఇరవై కోట్ల బడ్జెట్ ని దీని కోసం కేటాయించబోతున్నట్టు తెలిసింది. మాములుగా అయితే నానికి ఇంత మార్కెట్ లేదు. థియేటర్, ఓటిటి కలిపినా ఈ స్థాయిలో వసూలు చేయడం అంత సులభం కాదు. కానీ నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ రిస్క్ కు సిద్ధపడినట్టు టాక్.

యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సికంద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. పీరియాడిక్ డ్రామా కాబట్టి దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున సెట్లు వేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ఈ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇంత స్కేల్ లో ఖర్చు పెట్టేందుకు ప్రధాన కారణం దసరా ఇచ్చిన ధైర్యమేనని చెప్పాలి. ఊహించిన దానికన్నా ఎక్కువగా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన దసరా నైజాంలో భారీగా రాబట్టి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వసూలు చేసింది. యునానిమస్ గా కనెక్ట్ అయ్యుంటే సులభంగా థియేటర్ రెవిన్యూ నూటా యాభై కోట్లు దాటేది.

ఇదంతా లెక్కలు వేసుకునే నాని మీద పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం. పైగా సరిపోదా శనివారం అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యే కంటెంట్ గా ప్రచారం జరుగుతోంది. ఇది కనక నిజమైతే ప్యాన్ ఇండియా మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకున్న నానికి శ్యామ్ సింగ రాయ్ తో మిస్ అయిన అవకాశం మళ్ళీ ఏర్పడుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి కూడా ఇంటెన్స్ డ్రామానే రాసుకున్నాడట. ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం పడటంతో జనవరి నుంచి షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్, సంగీత దర్శకుడు, టెక్నికల్ టీమ్ ఇంకా నిర్ధారణ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి.