శంకర్.. మూడు మెగా మూవీస్

భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు శంకర్. ఇప్పుడందరూ పెద్ద పెద్ద బడ్జెట్లో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ.. 90వ దశకంలోనే సంచలన కథాంశాలతో మెగా బడ్జెట్ మూవీస్ చేసిన దర్శకుడాయన. తొలి చిత్రం ‘జెంటిల్‌మన్’ మొదలుకుని.. శంకర్ తీసిన ఎన్నో చిత్రాలు సంచలనం రేపాయి.

2010లో వచ్చిన ‘రోబో’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సమయానికి ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి కథ, ఆ తరహా విజువల్స్ ఊహకు కూడా అందనివి. త్వరలోనే ‘ఇండియన్-2’ లాంటి భారీ చిత్రంతో పలకరించబోతున్న శంకర్.. భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.

తాను మూడు భారీ బడ్జెట్ సినిమాలు తీయబోతున్నట్లు శంకర్ వెల్లడించాడు. ఆ మూడు కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుని చేయబోయే విజువల్ వండర్సే అని శంకర్ తెలిపాడు. గేమ్ చేంజర్, ఇండియన్-2 కూడా విడుదల అయ్యాక తాను ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను మొదలుపెట్టే అవకాశాలున్నట్లు శంకర్ తెలిపాడు. ఆ తర్వాత జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథ చేస్తానన్నాడు. ఇది ఏ తరహా సినిమా అని చెప్పడానికి ‘జేమ్స్ బాండ్’ అనే పదం వాడానని.. ఐతే ఇది ఆ స్టయిల్లో నడిచే యాక్షన్ కథ అని తెలిపాడు.

ఇది కాక హాలీవుడ్లో వచ్చిన 2012 తరహాలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా చేయాలనుకుంటున్నట్లు శంకర్ వెల్లడించాడు. ఏదో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలి అని ముందే అనుకుని చేస్తున్న సినిమాలు ఇవి కాదని.. కథ డిమాండ్ చేయడంతోనే ఎక్కువ బడ్జెట్ అవసరమని శంకర్ తెలిపాడు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సినిమాలు తెరకెక్కుతాయని.. అన్నింట్లోనూ విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని శంకర్ చెప్పాడు.