విశ్వక్ చేస్తున్న రిస్క్ అవసరమే

రెగ్యులర్ కమర్షియల్ పంధాలో వెళ్లకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ కు ప్రయోగాలు చేసే అవకాశాలు వస్తున్నాయి కానీ భారీ బ్లాక్ బస్టర్ ఎదురు చూపులు మాత్రం కొనసాగుతున్నాయి. గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే అదేమో నిరాశపరిచింది. హిట్టని నిర్మాణ సంస్థ చెబుతోంది కానీ ఒకవేళ అదే నిజమైతే ఈపాటికి సీక్వెల్ ప్రకటన వచ్చి ఉండాలి. కానీ ఇదే బ్యానర్ అదే కాంబోలో వేరే మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఈ రోజు విశ్వక్ మరో కొత్త చిత్రం లైలాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కేవలం కళ్ళు మాత్రమే రివీల్ చేసిన లేడీ గెటప్ ఫస్ట్ లుక్ వదిలారు.

నిజానికి ఈ అమ్మాయిల వేషంలో కనిపించేందుకు యూత్ హీరోలు అంతగా ఆసక్తి చూపించరు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ మేడమ్, నరేష్ చిత్రం భళారే విచిత్రంతో హిట్లు అందుకున్నారు కానీ తర్వాత ఈ ప్రయత్నాలు చేసిన వాళ్ళు తక్కువే. చిరంజీవి లాంటి స్టార్లు సైతం ఏదో ఒక పాటలో కనిపించడం మినహా ఫుల్ లెన్త్ చేసింది లేదు. కానీ లైలా అలా కాదు. సినిమాలో అధిక భాగం విశ్వక్ లేడీగానే ఉంటాడట. దర్శకుడు రామ్ నారాయణ్ ఏదో డిఫరెంట్ పాయింట్ తో రాసుకున్నాడని తెలిసింది. కాకపోతే లైన్ కు సంబంధించిన లీక్ ఇంకా బయటికి రాలేదు. నిర్మాత సాహూ బడ్జెట్ కూడా బాగానే పెడుతున్నారు.

క్రియేటివిటీ తగ్గిపోయి హీరోలకు కథలు దొరకడం కష్టమైన ట్రెండ్ విశ్వక్ లాంటి హీరోలు ఈ తరహా ప్రయోగాలు చేయడం అవసరమే. ఇమేజ్ ఉంది కదా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరనే అనుమానం అక్కర్లేదు. కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంటే థియేటర్లకు వచ్చి మరీ చూస్తారు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికన్నా ముందు విశ్వక్ మెకానిక్ రాకీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్నట్టు లైలాలో బోలెడు ఫన్ తో పాటు కమర్షియల్ హంగులకు ఎలాంటి లోటు ఉండదట. తనీష్క్ బాగ్చీ – జిబ్రాన్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు.