‘కల్కి’లో ఆ అబ్బాయి పాత్రపై ట్విస్ట్

ప్రపంచ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా పేరు మార్మోగేలా చేస్తున్న చిత్రం.. కల్కి. గత గురువారం రిలీజైన ఈ చిత్రంలో కాన్సెప్ట్, విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. తొలి వీకెండ్లో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో వసూళ్లు ఏ స్థాయికి చేరుతాయో చూడాలి.

ఈ సినిమాలో పాత్రలకు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్న సమయంలో ఒక సీక్రెట్ బయటికి వచ్చింది. సినిమాలో రైయా అనే చిన్న పిల్లాడి పాత్ర బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. అశ్వథ్థామ వెంటే ఉంటూ అనేక ప్రశ్నలు అడుగుతూ తన నుంచి సమాధానాలు రాబట్టడమే కాక.. తర్వాత ఆ పాత్రకు ఎలివేషన్ రావడానికి కారణమయ్యే పాత్ర అది.

సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రల్లో రైయా ఒకటి. ఐతే సినిమాలో చూస్తే అక్కడున్నది అబ్బాయి అనే అనుకుంటాం. కానీ నిజానికి ఆ పాత్ర చేసింది అబ్బాయి కాదు, అమ్మాయి. ఇప్పుడు ప్రమోషన్లలో భాగంగా ఆ అమ్మాయి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే కానీ.. ఈ విషయం బయటికి రాలేదు. తన పేరు.. కేయా నాయర్. కేరళకు చెందిన అ అమ్మాయే రైయా అనే అబ్బాయి పాత్రలో కనిపించింది సినిమాలో. ఇలా అమ్మాయిలు అబ్బాయిలుగా నటించడం కొత్తేమీ కాదు.

‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడి పాత్ర చేసింది రోజా రమణి అన్న సంగతి తెలిసిందే. శ్రీదేవి సైతం కొన్ని చిత్రాల్లో అబ్బాయిగా కనిపించింది. ఆ ఒరవడినే కొనసాగిస్తూ కేయతో రైయా పాత్ర చేయించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ అమ్మాయి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది. చిన్నా పెద్దా అని చూడకుండా సెట్స్‌లో అందరినీ ప్రభాస్ గౌరవిస్తాడని.. ప్రేమగా చూసుకుంటాడని కేయా చెప్పింది. అమితాబ్ షూటింగ్‌కు వచ్చిన తొలి రోజే ప్రభాస్ పాదాభివందనం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది.