ప్రభాస్ సునామీకి అజయ్ దేవగన్ ఆందోళన

తెలుగులో రికార్డులు సృష్టించడంలో ఆశ్చర్యం లేదు కానీ కల్కి 2898 ఏడి బాలీవుడ్ లోనూ భారీ వసూళ్లు నమోదు చేయడం ఊహించిన దానికన్నా పెద్ద పరిణామం. కేవలం నాలుగు రోజుల్లో వంద కోట్ల దాటడం మాటలు కాదు.

రెండో వారంలోనూ ఇదే జోరు కొనసాగుతుందని అక్కడి ట్రేడ్ అంచనా వేస్తున్న నేపథ్యంలో అజయ్ దేవగన్, అతని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే జూలై 5 ఈ శుక్రవారం ఆరోన్ మే కహాన్ దమ్ తా విడుదలవుతుంది. మాములుగా అయితే ఈ వీక్ లో పెద్దగా చెప్పుకునే రిలీజ్ ఏం లేవు. దీంతో సోలోగా మార్కెట్ ని లాగేయొచ్చని నిర్మాతలు అనుకున్నారు.

తీరా చూస్తే కల్కి జోరు చూస్తుంటే దాని దెబ్బ నేరుగా ఆరోన్ మే కహాన్ దమ్ తా మీద పడేలా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు వాయిదా వేయమని కోరుతున్నారట. ఎందుకంటే ఇదో ఎమోషనల్ డ్రామా. అజయ్ దేవగన్, టబు హీరో హీరోయిన్ గా సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత నటించారు.

దృశ్యంలో ఉన్నారు కానీ అందులో జోడి కాదు. దీంతో ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. నీరజ్ పాండే లాంటి దర్శకుడు తీసినప్పటికీ కంటెంట్ విపరీతమైన భావోద్వేగాలకు సంబంధించినది కావడంతో మాస్ జనాలు అంతగా పట్టించుకోవడం లేదు. ఇదే సమస్య.

కల్కి సునామి తాకిడిలో తన సినిమా ఎక్కడ ఇబ్బంది పడుతుందోననే అజయ్ ఆందోళన పడుతున్నాడు. ఇంకో వైపు పంపిణీదారులు ఈ నెల చివరికి వాయిదా వేయడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే జూలై 12 కమల్ హాసన్ ఇండియన్ 2తో పాటు అక్షయ్ కుమార్ సర్ఫిరాలు వస్తున్నాయి.

మధ్యలో నలిగిపోవడం కన్నా మంచి డేట్ చూసుకుని చక్కని వసూళ్లు రాబట్టుకోవచ్చని సలహాలు ఇస్తున్నారు. ఈ ఏడాది షైతాన్ రూపంలో సూపర్ హిట్ అందుకున్న అజయ్ దేవగన్ కరోనా తర్వాత దృశ్యం 2 లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అలాంటి పెద్ద స్టార్ కి ఈ పరిస్థితి రావడం బాక్సాఫీస్ విచిత్రమే.