వీకెండ్ బాక్సాఫీసుని కమ్మేసిన భైరవ

శనివారం రోజు వరల్డ్ కప్ ఫైనల్. అయినా సరే కల్కి 2898 ఏడి షోలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. నిన్న నాలుగో రోజు ఎంత ఆదివారమైనా నెంబర్లు కాస్త నెమ్మదిస్తాయనే అంచనాలకు భిన్నంగా వసూళ్లు పోటెత్తడం చూసి ట్రేడ్ షాక్ అయ్యింది. టికెట్ రేట్ల పెంపు ఎక్కువగానే ఉన్నా ఈ విజువల్ గ్రాండియర్ కి అంత మొత్తం ఇవ్వడం న్యాయమేనని భావిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా చోట్ల మల్టీప్లెక్సుల టికెట్లు దొరకని కారణంగా అతి మాములుగా ఉండే కొన్ని సింగల్ స్క్రీన్లు సైతం కిక్కిరిసిపోయాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మొదటి వీకెండ్ కు గాను వరల్డ్ వైడ్ 550 కోట్లకు పైగా గ్రాస్, నార్త్ అమెరికాలో 11 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన కల్కి ఈ దూకుడు అంత సులభంగా తగ్గించేలా లేదు. సాధారణంగా డ్రాప్ ఉండే సోమవారం సైతం బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. నిన్న మొన్న సగటున గంటకు 95 వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం ఆ యాప్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దొరకవనే అంచనాతో ఆన్ లైన్ లో ఖరారు చేసుకున్నాకే ఆడియన్స్ అడుగు బయట పెడుతున్నారు. ఇది మాటల్లో వర్ణించే సునామి అయితే కాదు.

రాబోయే శుక్రవారం సైతం చెప్పుకోదగ్గ రిలీజ్ ఒక్కటీ లేకపోవడం కల్కి 2898 ఏడి రికార్డులను మరింత మెరుగు పరచడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ లో రెండు వారాలు హైక్ తీసుకున్నారు కాబట్టి అక్కడి ఫిగర్స్ ఇంకా భారీగా పెరగబోతున్నాయి. ఒకవేళ నైజామ్ ధరలు కొంత తగ్గించినా ఆక్యుపెన్సీ పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెట్టి భవిష్యత్తుని ఊహించి దర్శకుడు నాగ అశ్విన్ ఆవిష్కరించిన ఈ విజువల్ వండర్ హిందీలోనూ 100 కోట్లను సులభంగా దాటేయడం చూసి డిస్ట్రిబ్యూటర్లు నివ్వెరపోతున్నారు. టాలీవుడ్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.