కల్కికి ఉన్న అడ్వాంటేజ్ అదే..

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధికంగా రూ.700 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అంత ఎందుకు ఖర్చు పెట్టారు అనే విషయం అర్థమైపోయింది. రిలీజ్ ముంగిట ప్రమోషన్లు గట్టిగా చేయకున్నా.. వారం ముందు వరకు హైప్ లేదు అనిపించినా.. రిలీజ్ టైంకి మొత్తం మారిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు దీటుగా కనిపించాయి.

ఐతే ఈ సినిమాకు టాక్ మాత్రం ఫుల్ పాజిటివ్‌గా రాలేదు. అయినా తొలి రోజు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కొంత మిక్స్డ్ టాక్‌ ఉన్న నేపథ్యంలో రెండో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే రెండో రోజు కూడా వంద కోట్లకు చేరువగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక శని, ఆదివారాల్లో వీకెండ్ కాబట్టి వసూళ్లకు ఢోకా ఉండదు. తొలి వారాంతంలోనే బయ్యర్లు చాలా వరకు సేఫ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

‘కల్కి’లో కొన్ని అంశాల గురించి కంప్లైంట్లు ఉన్నాయి. కథ గందరగోళంగా ఉందని, అర్థం కాలేదని..డ్రామా పండలేదని.. ఎమోషనల్ కనెక్ట్ మిస్సయిందని.. ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి ప్రేక్షకుల నుంచి. సమీక్షల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించారు. ఐతే ఇలా ఎన్ని కంప్లైంట్లు చెప్పినా.. సినిమా బాలేదని, చూడాల్సిన అవసరం లేదని మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదు. కొన్ని లోపాలున్నప్పటికీ ఇది మస్ట్ వాచ్ అన్నదే అందరి మాట.

మహాభారతం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు.. అశ్వథ్థామ పాత్ర.. చివరి అరగంటలో విజువల్ మాయాజాలం.. ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనివి. టికెట్ డబ్బులకు మించి ఇవి వినోదాన్నిచ్చే విషయాలే. నాగ్ అశ్విన్ అండ్ టీం పడ్డ కష్టం.. వాళ్ల ప్యాషన్ చూశాక లోపాలున్ననా మన్నించబుద్ధేస్తుంది ఎవరికైనా. అందుకే సినిమా చూసిన వాళ్లు కొన్ని లోపాలు ప్రస్తావిస్తూనే.. తప్పక చూడాల్సిన సినిమా అనే అందరికీ చెబుతున్నారు. అందుకే ‘కల్కి’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. అంతిమంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్నే అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.