ప్రభాస్‌ను అందుకోవడం కష్టమబ్బా..

కేవలం ఒక్క సినిమాతో ఒక హీరో మార్కెట్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ‘బాహుబలి’తో ప్రభాస్ విషయంలోనే జరిగింది. ఐతే ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే అని, ప్రభాస్‌ది ఏమీ లేదని తక్కువ చేసే ప్రయత్నం చేసిన వాళ్లూ లేకపోలేదు. కానీ రాజమౌళితో అంతకుముందు, తర్వాత పని చేసిన హీరోలకు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరగలేదన్నది గుర్తించాల్సిన విషయం.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి ఫలితాలు ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ చూస్తే మాత్రం ప్రభాస్ స్టామినా ఏంటన్నది అర్థమవుతుంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా సరే.. సాహో, ఆదిపురుష్ చిత్రాలకుకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల వసూళ్లను ఈ డిజాస్టర్ మూవీస్ అధిగమించడం గమనార్హం.

‘బాహుబలి’ తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు పడేసరికి ప్రభాస్ పనైపోయిందని తీర్మానించేశారు కొంతమంది. కానీ ‘సలార్’తో అతను సాగించిన వసూళ్ల ప్రభంజనం చూసి నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. ఆ సినిమా ఓపెనింగ్ నంబర్లు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు దగ్గరగా వెళ్లడం విశేషం. ఇక లేటెస్ట్‌గా ప్రభాస్ నుంచి వచ్చిన ‘కల్కి’కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు ఔరా అనుకుంటున్నారు. ‘కల్కి’కి పెద్దగా ప్రమోషన్లు చేయకున్నా.. ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోయింది.

హిందీలో టాప్ స్టార్ల సినిమాలు 10-15 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుంటే.. ‘కల్కి’కి రెట్టింపు స్థాయిలో తొలి రోజు వసూళ్లు వచ్చాయి. అమెరికాలో తొలి రోజు 5.6 మిలియన్ డాలర్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది ‘కల్కి’. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఆరంభ వసూళ్లు వచ్చాయి. హైప్ లేదనుకున్న తమిళనాడు, కేరళల్లో కూడా ‘కల్కి’ అదరగొడుతోంది. కొంచెం మిక్స్డ్‌ టాక్ ఉన్నప్పటికీ.. ప్రభాస్ స్టార్ పవర్‌తో ఈ చిత్రం అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. దీన్ని బట్టి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో అతణ్ని టచ్ చేసే స్టార్ లేడని చెప్పొచ్చు.