ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ రిలీజైపోయింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దీని తర్వాత మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్న భారీ చిత్రం అంటే.. ఇండియన్-2నే. 28 ఏళ్ల కిందట వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమిది. 90వ దశకంలో ‘ఇండియన్’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అలాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అమితాసక్తి, భారీ అంచనాలు ఉంటాయి.
ఐతే సీక్వెల్ కథ ఏమై ఉంటుంది అనే విషయంలో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరిగాయి. ‘ఇండియన్’లో కమల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తే.. ‘ఇండియన్-2’లో కమల్‌తో పాటు సిద్దార్థ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో వీళ్లిద్దరి పాత్రలు, వారి మధ్య బంధం గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి.
కొందరేమో సిద్ధార్థ్.. కమల్ మనవడని, అతను అవినీతి చేస్తుంటే కమల్ వచ్చి తన పని పడతాడని అన్నారు. ఇంకొందరేమో.. మనవడు తాత బాటలో నిజాయితీపరుడిగా ఉండి హత్యలు చేస్తాడని, అతను కష్టాల్లో పడితే ఇండియన్ తిరిగొస్తాడని అన్నారు. మరోవైపు 1918లో పుట్టిన సేనాపతికి ఇప్పుడు వందేళ్లు దాటి ఉంటుందని.. ఇంకా బతికి ఉండడం ఏంటనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సేనాపతి కొడుకు చనిపోలేదని.. అతడిలో తర్వాత పరివర్తన వచ్చి తనే ఇండియన్ అవతారం ఎత్తుతాడని ఒక చర్చ నడిచింది. ఇలా కథ, పాత్రల పరంగా ఎన్నో వెర్షన్లు వినిపిస్తున్నాయి.
ఐతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తేల్చేశాడు కమల్ హాసన్. ‘ఇండియన్-2’ కథ గురించి తాను సోషల్ మీడియాలో చాలా వెర్షన్లు చూశానని.. కానీ ఏ ఒక్కరూ ఈ సినిమా కథను సరిగ్గా అంచనా వేయలేకపోయారని.. అది తనకు సంతోషాన్నిచ్చిన విషయమని.. ఈ కథ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates