జక్కన్న మహాభారతానికి పెరుగుతున్న డిమాండ్

నిన్న విడుదలైన కల్కి 2898 ఏడిలో మహాభారతానికి సంబంధించి కేవలం కొన్ని నిమిషాల సీక్వెన్సులే చూపించాడు దర్శకుడు నాగ అశ్విన్. అది కూడా అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, అశ్వద్ధామల మధ్య జరిగే కీలక ఎపిసోడ్ కు సంబంధించినదే తప్ప ఇంకెలాంటి ఘట్టాలను తీసుకోలేదు. అయినా సరే దీని గురించి అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడి మొహాన్ని చూపించకపోయినా సదరు నటుడు వేరే బాష నుంచి వచ్చినా ఎవరికి వారు తమకిష్టమైన హీరోలను ఊహించేసుకుంటూ ట్వీట్లు పెట్టి వైరల్ చేస్తున్నారు.

దీనికే ఇలా ఉంటే ఒకవేళ రాజమౌళి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టు మహాభారతానికి కనక శ్రీకారం చుడితే అది చరిత్రలో అతి గొప్ప మాస్టర్ క్లాసిక్ గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జక్కన్నకు ఇష్టమైన వాటిలో దానవీరశూరకర్ణ ప్రధమ స్థానంలో ఉంటుంది. అలాంటి గ్రాండియర్ ని ఇప్పటి టెక్నాలజీ వాడి రాజమౌళి మార్కు ఎలివేషన్లు, ఎమోషన్లు కనక కరెక్ట్ గా పండిస్తే నాగ్ పూర్ నుంచి నిజామాబాద్ దాకా ప్రేక్షకులు వెర్రెక్కిపోయి చూస్తారు. అలా అని భారతాన్ని ఒకటి రెండు భాగాల్లో చూపించడం చాలా కష్టం. కానీ ఇది అంత సులభంగా కార్యరూపం దాల్చేది కాదు.

కన్నడలో ఈ ప్రయత్నం గతంలో చేశారు. కురుక్షేత్ర పేరుతో శాండల్ వుడ్ స్టార్స్ అందరినీ పెట్టి తీశారు. దర్శన్ దుర్యోధనుడిగా, అర్జున్ కర్ణుడిగా, రవిచంద్రన్ కృష్ణుడిగా కనిపించారు. ఒరిజినల్ బాగానే ఆడింది కానీ డబ్బింగ్ వెర్షన్లు సూపర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ రాజమౌళి రేంజ్ వేరు. నిజంగా ఆయన తలపెడితే అభిమానుల భాషలో చెప్పాలంటే థియేటర్లు తగలబడిపోతాయి. ఎప్పటికైనా మహాభారతం తీయాలనేది తన జీవితాశయంగా చెప్పిన జక్కన్న అదేదో నిజం చేస్తే బాగుంటుంది. అన్నట్టు కల్కి 2898 ఏడిలో క్యామియో చేయడానికి కారణం కూడా ఈ కనెక్షనే కారణమేమో ఎవరికి తెలుసు.