కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన రేణుక స్వామి మర్డర్ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ వ్యవహారం ఇంకా వేడిగానే ఉంది. ఆధారాలు బలంగా ఉండటంతో పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. సాటి హీరోలు, నటీనటులు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనే తరహాలో స్టేట్ మెంట్లు ఇస్తున్నారు తప్పించి తనకు మద్దతుగా పేరున్న స్టార్లు ఎవరూ నోరు విప్పడం లేదు. అలాంటిది టాలీవుడ్ నుంచి నాగ శౌర్య నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానంటూ ఇన్స్ టా వేదికగా సుదీర్ఘమైన మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇది వేళ కాదు.
ఎవిడెన్స్ మాయం చేసేందుకు డబ్బులు ఇచ్చానని దర్శనే ఒప్పుకున్నట్టు శాండల్ వుడ్ మీడియా కోడై కూస్తోంది. హత్య జరిగిన ప్రదేశంలో ఇతని కారు తిరిగిన విజువల్స్ సిసి కెమెరా ఫుటేజ్ లో దొరికాయి. పవిత్ర గౌడతో అతనికున్న సంబంధం ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో దర్శన్ చాలా మంచివాడనే తరహాలో నాగ శౌర్య సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం లేనిపోని నెగటివిటీని తెస్తోంది. రేణుకస్వామి హత్య జరిగాక తీసిన ఫోటోలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్లకు ఉరిశిక్ష చాలా తక్కువే అనిపిస్తుంది.
అలాంటిది ఇంత పబ్లిక్ గా మద్దతు తెలుపడం సరికాదని స్వంత ఫ్యాన్సే అంటున్నారు. ఒకవేళ దర్శన్ నిర్దోషిగా బయట పడి కోర్టు క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు బెంగళూరు వెళ్లి అభినందించినా తప్పు లేదు. కానీ కళ్ళముందు ఇన్ని ప్రూఫ్స్ కనిపిస్తూ ఉంటే ఐ స్టాండ్ విత్ దర్శన్ అని చెప్పడం లేనిపోని ప్రతికూల పబ్లిసిటీకి దారి తీస్తుంది. అసలే నాగ శౌర్య మార్కెట్ డౌన్ లో ఉంది. వరస డిజాస్టర్లతో తప్పెక్కడ జరిగిందో కనుక్కునే ప్రయత్నంలో నిర్మాణంలో ఉన్న సినిమాను సైతం హోల్డ్ లో పెట్టాడు. అలాంటిది ఇప్పుడీ దర్శన్ ఉదంతంతో అటు కన్నడ సోషల్ మీడియాలోనూ అనవసరంగా టార్గెట్ అవుతున్నాడు