సూర్య కంగువతో రసవత్తరంగా దసరా పోటీ  

సౌత్ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో సూర్య కంగువ ఒకటి. సిరుతై శివ దర్శకత్వంలో సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు ఇప్పటికే టాక్ ఉంది. విడుదల తేదీ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న సూర్య బృందం ఎట్టకేలకు దానికి చెక్ పెట్టేసింది. అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కోసం ఫిక్స్ చేసుకున్న స్లాట్ ఇది. పవన్ కళ్యాణ్ ఓజి వాయిదా పడటంతో వ్యూహం మార్చి సెప్టెంబర్ 27కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక్కడితో కథ అయిపోలేదు. అక్టోబర్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ వచ్చేలా ఉంది. డేట్ చెప్పలేదు కానీ అక్టోబర్ నెలలో ఉంటుందని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ దాని మీదే గురి పెట్టింది. మిస్టర్ బచ్చన్ ని ఆగస్ట్ బదులు దసరాకు వదులుదామని రవితేజ కోరుకున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. నిర్మాత మాత్రం పుష్ప 2 వదులుకున్న ఆగస్ట్ 15 వైపు చూస్తున్నారు. కానీ ఇప్పటికే మూడు సినిమాలు అక్కడ అఫీషియల్ గా కర్చీఫ్ వేసేశాయి. ఇవన్నీ ముందుగానే ఊహించిన కంగువ టీమ్ చాలా తెలివిగా పోటీ కోణంలో ఆలోచించి వ్యూహం పన్నింది.

నిర్మాణ భాగస్వామ్యంలో యువి ఉండటంతో తెలుగు వెర్షన్ సైతం భారీ రిలీజ్ దక్కించుకోనుంది. దిశా పటాని హీరోయిన్ గా బాబీ డియోల్ విలన్ గా నటించిన కంగువ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా సూర్య డ్యూయల్ రోల్ లో రూపొందింది. కథకు సంబంధించిన ఎక్కువ లీక్స్ లేవు కానీ విజువల్ గా చాలా గొప్పగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న కంగువ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇతర భాషల్లో తగ్గిపోయిన తన మార్కెట్ కోసం సూర్య కసిమీదున్నాడు. రెండేళ్లుగా దీని కోసమే కష్టపడుతూ ఇతర కమిట్ మెంట్లు పెండింగ్ లో పెట్టేశాడు.