కృష్ణుడి నిర్ణయం అన్నగారి మీద గౌరవమే

ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడిలో పలు అంశాల గురించి మూవీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని దానికి సైన్స్ ఫిక్షన్ జోడించిన దర్శకుడు నాగ అశ్విన్ కీలకమైన అశ్వద్ధామ, అర్జునుడు లాంటి పాత్రలకు యాక్టర్లను తీసుకుని కథకు ప్రాణమైన శ్రీకృష్ణుడి పాత్రను మాత్రం ఒక నీడ లాంటి క్యారెక్టర్ తో నడిపించడం పట్ల ఫ్యాన్స్ లో పలు అనుమానాలు తలెత్తాయి. ముందు న్యాచురల్ స్టార్ నానినే కృష్ణుడనే ప్రచారం సోషల్ మీడియాలో తిరిగింది. కానీ అదేమీ నిజం కాదని బెనిఫిట్ షో చూడగానే అర్థమైపోయింది.

శ్రీకృష్ణుడిగా ఎవరినీ తీసుకోకపోవడం వెనుక ఒక ఆసక్తికరమైన సంగతి వినిపిస్తోంది. వైజయంతి మూవీస్ సంస్థని 1974లో ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. మొదటి సినిమా కూడా ఆయనతోనే కలర్ సినిమా స్కోప్ లో తీశారు అశ్వినిదత్. స్వతహాగా ఆయన వీరాభిమాని కావడం వల్లే చిన్న వయసులోనే అంత సాహసానికి పూనుకున్నారు. అప్పటికే తెలుగు నేల మీద కృష్ణుడు, రాముడు అంటే ఒక్క ఎన్టీఆర్ తప్ప వేరెవరు కాదనే అభిప్రాయం అందరితో పాటు దత్తుగారి మనసులోనూ నాటుకుపోయింది. అందుకే బ్యానర్ లోగోకు అన్నగారి చిత్రాన్నే వాడుకున్నారు.

అంతటి ఆరాధనాభావం కలిగి ఉండటం వల్లే శ్రీకృష్ణుడుగా మరొకరిని చూపించలేననే దత్తు గారి ఆకాంక్షకు తగ్గట్టుగా నాగ్ అశ్విన్ ఆ పాత్రను అలా డిజైన్ చేసినట్టు తెలిసింది. ఇదంతా దర్శకుడు చెప్పింది కాకపోయినా యూనిట్ నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయం బయట పడింది. ఏదైతేనేం తెరమీద చేసిన ఈ మేజిక్ బ్రహ్మాండంగా పండింది. నిన్నటి దాకా ఏఐ టెక్నాలజీ వాడి ఎన్టీఆర్ నే కృష్ణుడిగా చూపించారనే ప్రచారం జరిగింది కానీ అదేమీ కాదు. ఇతిహాసానికి సైన్స్ ఫిక్షన్ ముడిపెట్టి ఒక కొత్త ప్రయోగం చేసిన నాగ్ అశ్విన్ దానికి తగ్గ గొప్ప ఫలితమే దక్కింది.