టాలీవుడ్ స్టార్ డైెరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన కెరీర్లో ఎంతో విలువైన కొన్నేళ్లను వృథా చేసుకున్నాడు. ఒకప్పుడు పవన్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పవన్.. ఆ తర్వాత పవన్ కోసం ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే మరో కథ రెడీ చేసుకుని ‘గద్దలకొండ గణేష్’ తర్వాతి చిత్రం పవన్‌తోనే చేయాలని చూశాడు. కానీ ఆ ప్రాజెక్టు చాన్నాళ్ల పాటు కార్యరూపం దాల్చలేదు.
ముందు అనుకున్న కథను మార్చుకుని వేరే స్టోరీతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మొదలుపెట్టాడు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఇది కూడా ముందుకు కదల్లేదు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయి ఈ సినిమాతో పాటు వేరే చిత్రాలను కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన తిరిగి ఎప్పుడు ముఖానికి రంగేసుకుంటాడో తెలియట్లేదు.
పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా.. ఆయన ప్రయారిటీల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చివర్లోనే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. ముందుగా ‘హరిహర వీరమల్లు’. ఆ తర్వాత ‘ఓజీ’ చిత్రాలనే పవన్ పూర్తి చేస్తాడట. కాబట్టి వచ్చే ఏడాది కాలంలో ‘ఉస్తాద్..’ ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు హరీష్ త్వరలోనే ‘మిస్టర్ బచ్చన్’ను పూర్తి చేసి ఫ్రీ కానున్నాడు. దీంతో ‘ఉస్తాద్..’ మళ్లీ సెట్స్ మీదికి వెళ్లేలోపు మరో సినిమా చేసేద్దామని హరీష్ చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
చిరు కూడా ఈ ఏఢాది చివరికి ‘విశ్వంభర’ పూర్తి చేసి ఖాళీ అవుతారు. ఆలోపు హరీష్ స్క్రిప్టు రెడీ చేసుకుంటే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను మొదలుపెట్టొచ్చు. చిరుతో హరీష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమానే తీస్తాడు కాబట్టి.. ఆరు నెలల్లో అవగొట్టేసేందుకు స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత పవన్ అందుబాటును బట్టి ‘ఉస్తాద్..’ను తిరిగి మొదలుపెట్టవచ్చు. చిరు-హరీష్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates