అందరూ కల్కి 2898 ఏడి గురించే మాట్లాడుకుంటున్నారు కానీ దాని తర్వాత కేవలం పదిహేను రోజుల్లో విడుదల కాబోతున్న భారతీయుడు 2 ఊసులు ఎక్కడా కనిపించడం లేదు.
కమల్ హాసన్ రెండు సినిమాల్లో ఉన్నారు కాబట్టి కల్కి రిలీజయ్యాక తన ప్రమోషన్లను పెంచే ప్లాన్ లో ఉన్నారు దర్శకుడు శంకర్. ఈ నెలాఖరున హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ టెన్షన్ కు అసలు కారణం సరైన బజ్ లేకపోవడం. అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఆల్బమ్ కి యునానిమస్ గా ఛార్ట్ బస్టర్ రిపోర్ట్ రాకపోవడం బాగా ప్రతికూలంగా మారింది.
ఇప్పుడు అంచనాలు పెంచే బాధ్యత ట్రైలర్ మీద పడింది. ఫైనల్ కట్ సిద్ధం చేసి ఉంచారు. రెండున్నర నిమిషాల వీడియోలో హైప్ పెంచే కంటెంట్ ఏముందో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఇటీవలే తమిళంలో భారతీయుడు 1 రీ రిలీజ్ చేస్తే కోలీవుడ్ ఆడియన్స్ ఏమంత ఆసక్తి చూపించలేదు.
విజయ్ గిల్లిని వారాల తరబడి ఎగబడి చూసిన జనం లోకనాయకుడి మూవీని లైట్ తీసుకున్నారు. తెలుగు డబ్బింగ్ రెండుసార్లు వాయిదా పడింది. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇప్పటి తరం ప్రేక్షకులకు అంత ఎగ్జైట్ మెంట్ కలిగించలేకపోతోంది. జూలై 12 రిలీజ్ నాటికి ఈ పరిస్థితిలో అనూహ్యమైన మార్పు వస్తే తప్ప బజ్ రాదు.
విక్రమ్ తెలుగులోనూ బ్రహ్మాండంగా సక్సెసైన నేపథ్యంలో భారతీయుడు 2ని అంతకన్నా భారీగా థియేటర్లలో వదిలేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కల్కి 2898 ఏడి కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనీసం నాలుగు వారాల పాటు దాని ప్రభంజనం ఉంటుంది.
అలాంటప్పుడు భారతీయుడు 2 ఓపెనింగ్స్ కి దెబ్బ పడుతుంది. తమిళనాడులో కాకపోయినా ఏపీ తెలంగాణలో దీని ఎఫెక్ట్ చాలా బలంగా ఉంటుంది. అందుకే లైకా సంస్థ ప్రస్తుతానికి జూలై 12ని హైలైట్ చేయకుండా పబ్లిసిటీ చేస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల టాక్ ప్రకారమైతే ఆ తేదీలో ఎలాంటి మార్పు లేదు. కావాల్సింది హైప్ మాత్రమే.