సినిమాకు 700.. ప్ర‌భాస్‌కు 150

క‌ల్కి సినిమా మ‌ద‌లైన‌పుడే ఇది ఇండియాలో అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న సినిమా అని వైజ‌యంతీ మూవీస్ ప్ర‌క‌టించింది. ముందు ఈ సినిమా బ‌డ్జెట్ 500 కోట్లని అనుకున్నారు. కానీ త‌ర్వాత అది 600 కోట్ల‌కు పెరిగింది. రిలీజ్ టైంకి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం క‌ల్కి బ‌డ్జెట్ ఏకంగా రూ.700 కోట్ల‌ట‌. ఈ సినిమా ప్రోమోలు చూస్తే అంత ఖ‌ర్చు కావ‌డంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేద‌నే అనిపిస్తుంది. ప్రొడ‌క్ష‌న్లో ఆ స్థాయి క్వాలిటీ క‌నిపిస్తోంది.

ఇందులో ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ మాత్ర‌మే రూ.450 కోట్ల‌ట‌. మిగ‌తా 250 కోట్లు కేవ‌లం పారితోష‌కాల‌కే అయింద‌న్నది యూనిట్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో మేజ‌ర్ వాటా హీరో ప్ర‌భాస్‌కే వెళ్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స‌లార్ త‌ర‌హాలోనే ఈ చిత్రానికి కూడా ప్ర‌భాస్ రూ.150 కోట్ల దాకా రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌భాస్‌కు ఉన్న ఇమేజ్‌, మార్కెట్‌కు.. అత‌ను ఈ సినిమా కోసం వెచ్చించిన స‌మ‌యం, ప‌డ్డ క‌ష్టానికి అత‌ను ఈ స్థాయిలో పారితోష‌కం తీసుకోవ‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. క‌ల్కిలో కీల‌క పాత్ర‌లు పోషించిన అమితాబ్, క‌మ‌ల్ హాస‌న్ త‌లో రూ.20 కోట్ల చొప్పున పారితోష‌కం తీసుకున్నార‌ట‌. మిగ‌తా ఆర్టిస్టులంద‌రికీ క‌లిపి రూ.60 కోట్ల మేర రెమ్యూన‌రేష‌న్ల ఖ‌ర్చు తేలింది.

క‌ల్కికి రికార్డు స్థాయిలోనే బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. థియేట్రిక‌ల్ హ‌క్కుల రూపంలోనే రూ.600 కోట్లు దాకా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. డిజిటల్ హ‌క్కులు అందులో స‌గం కంటే ఎక్కువే తెచ్చి పెట్టి ఉంటాయని అంచ‌నా. మొత్తంగా రూ.1000 కోట్ల మేర ఈ చిత్రం బిజినెస్ చేసి ఉంటుంద‌ని భావిస్తున్నారు. క‌ల్కి ఈ నెల 27న ప్రపంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న ఇండియ‌న్ సినిమా ఇదే కాబోతోంది.